హకీమ్ బాబర్ రెండో వివాదం: పాకిస్థాన్ నుండి వెలుగులోకి వచ్చిన ఒక పెళ్లి వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. 70 ఏళ్ల హకీమ్ బాబర్, 26 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 44 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో, పెళ్లి వీడియోలు వైరల్ కాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ పెళ్లి ఎలా వెలుగులోకి వచ్చింది?
వృత్తిరీత్యా మూలికా వైద్యుడైన (హకీమ్) బాబర్ పెళ్లి వేడుకలు, నికా మరియు ఫోటోషూట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. వీడియోలో వధువు ఎర్రటి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా, వరుడు కూడా అంతే ఉత్సాహంతో పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. వయసులో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.
మొదటి భార్య రియాక్షన్ షాకింగ్!
ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. హకీమ్ బాబర్‌కు ఇదివరకే పెళ్లయింది. మొదటి భార్య ఉండగానే ఆయన ఈ 26 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గొడవలు జరుగుతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్. తన భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మొదటి భార్య స్పష్టం చేసింది. అంతేకాదు, ఆమె తన సౌతి (సవతి) కాదని, సోదరి అని ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. మరో వీడియోలో రెండో భార్య, మొదటి భార్య తల దువ్వుతూ కనిపించడం విశేషం.
ఇద్దరు భార్యలతో కలిసి షాపింగ్
హకీమ్ బాబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన వీడియో కూడా వైరల్ అవుతోంది. “నా రెండో పెళ్లి వల్ల మొదటి భార్య కోపంగా ఉందని చాలా మంది అన్నారు. కానీ చూడండి, నా ఇద్దరు భార్యలు నాతోనే ఉన్నారు. వారిద్దరికీ ఒకే రకమైన సూట్లు కూడా కొనిచ్చాను” అని బాబర్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
