7,000 మైళ్ల పోరాటం.. ఒకే ఒక్క చేపను కాపాడటానికి ఏకమైన అమెజాన్ దేశాలు.. అసలు కారణం ఏంటి?

అమెజాన్ అడవుల సరిహద్దుల్లో ఉన్న బ్రెజిల్ సహా పలు దేశాలు ఒక ప్రత్యేక రకమైన చేప జాతిని రక్షించుకోవడానికి పోరాడుతున్నాయి. అమెజాన్ అడవుల్లో వర్షాకాలం మొదలైందంటే చాలు, ఆ భారీ నది ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. వేల ఏళ్లుగా అక్కడి గిరిజనులకు ఈ నీటి ప్రవాహం ఒక సంకేతం. ఎవరికో తెలుసా? ‘డొరాడో’ (Dorado) అనే క్యాట్ ఫిష్ రకానికి చెందిన చేపలకి! ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మంచినీటి ప్రయాణం (Freshwater Migration) చేసే ఈ ‘బంగారు’ చేపల మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

అట్లాంటిక్ నుండి ఆండీస్ పర్వతాల వరకు: సుమారు 6 అడుగుల పొడవు, 200 కిలోల బరువు ఉండే ఈ చేపలు ‘గోలియత్’ (Goliath) కుటుంబానికి చెందినవి. అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఆండీస్ పర్వత పాదాల వరకు ఇవి చేసే 7,000 మైళ్ల ప్రయాణం ఒక జీవవైవిధ్య అద్భుతం.

  • బాల్యం: గుడ్ల నుండి వచ్చే పిల్ల చేపలు నదీ ప్రవాహంతో పాటు వేల మైళ్లు ప్రయాణించి సముద్ర తీర ప్రాంతాలకు చేరుకుని పెరుగుతాయి.
  • తిరుగు ప్రయాణం: రెండేళ్ల తర్వాత, ‘తాము పుట్టిన చోటే గుడ్లు పెట్టాలి’ అనే పట్టుదలతో నదీ ప్రవాహానికి ఎదురీదుతూ తిరిగి కొండ ప్రాంతాలకే చేరుకుంటాయి.

సరిహద్దులు లేని ప్రయాణం.. సవాలక్ష చిక్కులు! ఈ చేపలు తొమ్మిది దేశాల సరిహద్దులను దాటుతూ ప్రయాణిస్తాయి. ఇందులో ఏ ఒక్క దేశంలో మార్పు వచ్చినా అది మొత్తం అమెజాన్ నదీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బ్రెజిల్‌లో నిర్మించిన రెండు పెద్ద ఆనకట్టల వల్ల, పొలివియా దేశంలో ఈ చేపల సంఖ్య కేవలం 15 ఏళ్లలో 80% తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆనకట్టలు ఈ చేపలకు పెద్ద గోడలుగా మారి, వాటి దారిని అడ్డుకుంటున్నాయి.

ఎందుకీ ఆందోళన? ఇది కేవలం చేపల సంఖ్య తగ్గడం గురించి మాత్రమే కాదు; అమెజాన్ ప్రజల జీవనాధార సమస్య. అమెజాన్‌లో పట్టుబడే చేపలలో 93% ఇలా వలస వచ్చే చేపలే. వీటి ద్వారా ఏడాదికి సుమారు $436 మిలియన్ల (వేల కోట్ల రూపాయలు) ఆదాయం లభిస్తుంది. ఇవి తగ్గితే అమెజాన్ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

పరిష్కారం దిశగా ‘యాక్షన్ ప్లాన్’: ఇప్పుడు మేల్కొన్న అమెజాన్ ప్రాంతానికి చెందిన 6 దేశాలు, ఐక్యరాజ్యసమితి సహాయంతో ఒక అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని కోసం నిపుణులు కొన్ని పరిష్కారాలను సూచించారు:

  • సరైన ప్రణాళిక: ఆనకట్టలు కట్టే ముందే చేపల దారికి అడ్డంకి కలుగుతుందా అని అధ్యయనం చేయాలి.
  • ఫిష్ లాడర్స్ (Fish Ladders): ఉన్న ఆనకట్టల వద్ద చేపలు ఎక్కి వెళ్లడానికి వీలుగా సొరంగ మార్గాలు లేదా మెట్లు నిర్మించాలి.
  • పాత ఆనకట్టల తొలగింపు: వాడుకలో లేని పాత ఆనకట్టలను తొలగించి నది మార్గాన్ని పునరుద్ధరించాలి.

Posted

in

by

Tags: