పని ఒత్తిడి, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం అనే అంశాలపై ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, గంటల తరబడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తపై భార్య ప్రశ్నల వర్షం కురిపించడం కనిపిస్తుంది.
వీడియోలో ఏముంది? వీడియోలో ఆ మహిళ కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన భర్తతో నిలదీస్తూ, “ఇంటికి వచ్చారు కదా.. నాకు కేవలం 16 గంటలు ఇచ్చి, రైల్వేకు మాత్రం 72 గంటలు ఇస్తారా?” అని అడుగుతుంది. ఇంకా ఆవేదనతో, “నేను రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉండాలా? నేను కూడా 72 గంటల తర్వాతే ఇంటికి వస్తాను చూడండి” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, తన భర్త ఆఫీసు పనుల్లో మునిగిపోయి కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాడనేది ఆమె ఆవేదన.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేదు నిజం: మరోవైపు, ఆ భర్త నిస్సహాయంగా, అలసటతో ఏమీ మాట్లాడకుండా భార్య మాటలన్నీ వింటూ నిలబడిపోతాడు. ఇది కేవలం ఒక భార్యాభర్తల గొడవలా కాకుండా, నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది.
నెటిజన్ల స్పందన: ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోను దాదాపు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు:
- ఒక యూజర్, “అక్కా.. కనీసం అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వు, పాపం చాలా అలసిపోయి ఉన్నాడు. కనీసం మంచి నీళ్లయినా అడగాల్సింది” అని కామెంట్ చేశారు.
- మరో యూజర్, “అటు సుదీర్ఘ షిఫ్టులు, ఇటు ఇంట్లో అంచనాల మధ్య ఒక సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఇది ప్రతి ఇంటి కథ” అని రాశారు.
- ఇంకొందరు మాత్రం ఆ మహిళను సమర్థిస్తూ, “ఆమెది కోపం కాదు, భర్త ఆరోగ్యంపై ఆందోళన. అది కూడా ఒక రకమైన ప్రేమే” అని పేర్కొన్నారు.
