72 ప్రాణాలు.. 1153 దుకాణాలు బూడిద! 11 ఏళ్ల బాలుడు చేసిన ఘోరం.. కరాచీ అగ్నిప్రమాదంలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

కరాచీ (పాకిస్తాన్): పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న ప్రముఖ ‘గుల్ ప్లాజా’ (Gul Plaza) షాపింగ్ మాల్‌లో గత జనవరి 17న జరిగిన ఘోర అగ్నిప్రమాదం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ దారుణ ఘటనలో 72 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మాల్ పూర్తిగా తగలబడి బూడిదవడంతో, మంటలను పూర్తిగా అదుపు చేయడానికే అధికారులకు వారం రోజుల సమయం పట్టింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు తాజాగా కోర్టులో సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఒక 11 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా చేర్చడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అగ్గిపుల్లల ఆట తెచ్చిన ఆపద
దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. ప్రమాదం జరిగిన రోజున ఆ బాలుడు తన తండ్రి లేని సమయంలో అక్కడ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ పూల దుకాణాన్ని చూసుకుంటున్నాడు.

ఆ సమయంలో సదరు బాలుడు అగ్గిపెట్టెలోని అగ్గిపుల్లలను వెలిగిస్తూ ఆడుకున్నాడని, అదే ఈ భారీ ప్రమాదానికి కారణమని అతని స్నేహితుడైన 13 ఏళ్ల మరో బాలుడు పోలీసులకు కీలక సాక్ష్యం ఇచ్చాడు.

ఈ ప్రమాదం జరిగిన రోజు నుండి ఆ 11 ఏళ్ల బాలుడు, అతని తండ్రి ఇద్దరూ అదృశ్యమయ్యారు (పరారీలో ఉన్నారు). ప్రస్తుతం పోలీసులు వారిద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మాల్ మేనేజ్‌మెంట్‌పై కూడా కేసులు
ఈ కేసులో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్ రజాక్ గుజ్జర్ మాట్లాడుతూ.. సదరు బాలుడితో పాటు గుల్ ప్లాజా మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులైన తన్వీర్ పాస్తా, అమర్ ఇస్మాయిల్, మహమ్మద్ రంజాన్ మరియు మహమ్మద్ అమీన్‌లను కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.

మొత్తం 42 మంది ప్రభుత్వ సాక్షులతో దాఖలు చేసిన ఈ ఛార్జ్‌షీట్‌లో ఈ క్రింది వివరాలను పేర్కొన్నారు:

ఆస్తి నష్టం: అగ్నిప్రమాదం కారణంగా మొత్తం 1,153 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

తదుపరి చర్యలు: ఈ ఘటనపై జుడీషియల్ కమిషన్ నివేదిక త్వరలోనే కోర్టుకు సమర్పించబడుతుందని, ఆ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: