“73 ఏళ్ల వయసులో పెళ్లి ఆశా?.. మహిళలారా జర భద్రం!”.. విధవలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునే కేటుగాడు.. షాకింగ్ మోసం..!!!

మహారాష్ట్రకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు, సోషల్ మీడియాలో పరిచయమైన ఒక వ్యక్తిని నమ్మి, పెళ్లి చేసుకోవాలనే ఆశతో తన జీవితకాల సంపాదన అయిన రూ. 57 లక్షలను పోగొట్టుకుని నష్టపోయిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆ వ్యక్తి ఆ వృద్ధురాలితో ప్రేమగా మాట్లాడుతూ నమ్మకాన్ని చూరగొన్నాడు. పుణెలో విలాసవంతమైన ఇల్లు కొనిస్తానని చెప్పి ఆమెకున్న సొంత ఇల్లు అమ్మించడమే కాకుండా, ఆమె నగలను కూడా కాజేసి పరారయ్యాడు.

పోలీసుల విచారణలో, ‘అనుజ్ సంతోష్ తివారీ’ అనే ఆ వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు మరియు పత్రికా ప్రకటనల ద్వారా విధవలు, విడాకులు తీసుకున్న మహిళలను సంప్రదించి.. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి డబ్బు, నగలు మరియు ఆస్తులను దోచుకునే ఘరానా నేరస్థుడని తేలింది.

మహిళల పేర్లతో నకిలీ సిమ్ కార్డ్‌లు తీసుకోవడం, వారి పేరిట రుణాలు (లోన్లు) పొంది మోసాలు చేయడంతో పాటు లైంగిక వేధింపుల వంటి పలు కేసుల్లో ఇరుక్కున్న ఈ కేటుగాడిని.. ఏడాది పాటు గాలించిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో విష్ణునగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: