ముంబై: విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ కుటుంబ పోషణ కోసం ఒక వృద్ధ దంపతులు పడుతున్న శ్రమకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారి, నెటిజన్లను ఎంతగానో కదిలిస్తోంది. ముంబైలోని ప్రముఖ జుహూ బీచ్‌లో (Juhu Beach) 75 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన ఎండలో మిక్కీ మౌస్ వేషం వేసుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
వయసు కారణంగా దక్కని ఉపాధి:
ఆరాధన అనే యువతి తన ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో ఈ భావోద్వేగ భరితమైన వీడియోను పంచుకున్నారు. ఆ వృద్ధుడు తెలిపిన వివరాల ప్రకారం.. వయసు పైబడటం వల్ల అతనికి ఎక్కడా ఎటువంటి ఉద్యోగం దొరకలేదు. దీంతో నిరాశ చెందకుండా, బీచ్‌కి వచ్చే పిల్లలను అలరించాలనే ఉద్దేశంతో ఆయన ఈ మిక్కీ మౌస్ కాస్ట్యూమ్ ధరించడం ప్రారంభించారు. పిల్లలతో ఫోటోలు దిగుతూ, దాని ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే తన రోజువారీ అవసరాలను వెళ్లదీస్తున్నారు.
ఉక్కపోతలోనూ చెదరని చిరునవ్వు:
తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ.. ఆ బరువైన కాస్ట్యూమ్‌ను ధరించి ఆయన జుహూ బీచ్‌లో రోజంతా గడుపుతున్నారు. పిల్లలు ఆయనతో ఫోటోలు దిగాక, వారి తల్లిదండ్రులు ఇచ్చే కొద్దిపాటి సొమ్ముపైనే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. దుస్తుల లోపల చెమటతో పూర్తిగా తడిసిపోయినప్పటికీ, బయటకు మాత్రం పిల్లల కోసం చిరునవ్వుతో సేవ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
భర్తకు తోడుగా నిలిచిన భార్య:
ఈ వృద్ధుడికి తోడుగా ఆయన భార్య కూడా అదే బీచ్‌లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవిస్తున్న ఈ దంపతుల ఆత్మవిశ్వాసంపై సర్వత్రా ప్రశంసలు వ్యూక్తమవుతున్నాయి. అంతర్జాలంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు, వారి పట్టుదలను అభినందిస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
