8వ తరగతి చదివిన యువకుడి వలలో 10 మంది మహిళా కానిస్టేబుళ్లు; వింత ట్రిక్కుతో మనసు గెలిచి, పోలీసులకే నిద్ర లేకుండా చేశాడు

బరేలీ న్యూస్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. లఖీంపూర్‌కు చెందిన రాజన్ వర్మ అనే 8వ తరగతి చదివిన యువకుడు, ఏకంగా 10 మంది మహిళా కానిస్టేబుళ్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతడు రోజంతా యూపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌పై నిఘా ఉంచేవాడు.

రాజన్ కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసు ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…..

బరేలీ: పోలీస్ యూనిఫామ్ ధరించి, సుమారు డజను మంది మహిళా కానిస్టేబుళ్లను పెళ్లి పేరుతో మోసం చేసిన ఒక ఘరానా మోసగాడిని బరేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఈ మహిళా కానిస్టేబుళ్ల నుండి రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాడు. ఒక మహిళా కానిస్టేబుల్‌ను పెళ్లి కూడా చేసుకున్నాడు. బరేలీ కోత్వాలీ పోలీసులు నిందితుడిని శాటిలైట్ బస్ స్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సిటీ రాహుల్ భాటి ధృవీకరించారు. నిందితుడు కేవలం 8వ తరగతి మాత్రమే చదివాడు.

నిందితుడు పోలీసు అధికారిక వెబ్‌సైట్ నుండి మహిళా పోలీసుల వివరాలను (డేటా) సేకరించేవాడని భాటి తెలిపారు. మహిళా పోలీసులు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకుని, తనను తాను పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకునేవాడు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న తన ఫోటోలను పంపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిని తన వలలో వేసుకునేవాడు. నిందితుడు ఇప్పటివరకు 8 నుండి 10 ఘటనలకు పాల్పడినట్లు అంగీకరించాడు. రాజన్ వర్మపై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. ఇతడు ప్రధానంగా మహిళా పోలీసులనే టార్గెట్ చేసేవాడు. బరేలీ కోత్వాలీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో, ఒక మహిళా కానిస్టేబుల్ నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు.

లక్నోకు చెందిన ఒక వ్యక్తి సహాయంతో మహిళా పోలీసుల ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుని బ్యాంకుల నుండి లోన్లు కూడా తీసుకునేవాడు. నిందితుడు రాజన్ వర్మ లఖీంపూర్ ఖేరీ నివాసి. మహిళా పోలీసులతో సంబంధాలు పెట్టుకుని వారి నుండి డబ్బు వసూలు చేసేవాడు.

పోలీసు విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. లఖీంపూర్‌కు చెందిన ఒక ఎస్‌ఓజీ (SOG) కానిస్టేబుల్, రాజన్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాడు. ఆ సమయంలోనే రాజన్‌కు పోలీసులతో పరిచయాలు పెరిగాయి. ఉద్యోగం రాకపోయినా, పోలీసుల మధ్యే తిరుగుతూ వారి ఆహార్యాన్ని, ప్రవర్తనను గమనించేవాడు. యూనిఫామ్ ఎలా ధరించాలి, సెల్యూట్ ఎలా చేయాలి, ఆయుధాలను ఎలా పట్టుకోవాలి అనే విషయాలన్నీ పోలీసుల వద్దే నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక మహిళా పోలీసును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తన అసలు నిజస్వరూపం తెలియడంతో ఆ పెళ్లి పెటాకులైంది.

ఆ తర్వాత కూడా ఇతడు తన పంథాను మార్చుకోకుండా ఇతర మహిళా పోలీసులను వేటాడటం మొదలుపెట్టాడు. బరేలీకి చెందిన ఒక బాధితురాలు కోత్వాలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఇతడిని పట్టుకున్నారు. ప్లాట్ కోసం లోన్ తీసుకుంటానని తన కాగితాలు తీసుకున్న రాజన్, తన పేరుతో ఒక కారును కొన్నాడని, తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతుంటే అసలు విషయం బయటపడిందని బాధితురాలు తెలిపింది.


Posted

in

by

Tags: