రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్న భారతీయ విద్యార్థిని దివ్యా జోషి తన ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు.. మెడిసిన్ వంటి కఠినమైన కోర్సును చదువుతూనే, తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో పార్ట్‌టైమ్ పని చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాను షేర్ చేసిన వీడియోలో దివ్యా.. కస్టమర్ల ఇళ్లకు కాస్మెటిక్స్, కిరాణా సరుకులు డెలివరీ చేయడం ద్వారా ప్రారంభంలో సుమారు 300 రూబుల్స్ సంపాదించినట్లు వివరించారు.
దగ్గరలో ఉన్న ఆర్డర్లను ఆమె నడుచుకుంటూనే డెలివరీ చేస్తుంటారు. ఇలా 8 గంటల పాటు పనిచేసి మొత్తం 20 డెలివరీలు పూర్తి చేసినట్లు వీడియోలో చూపించారు. ఆ రోజు ఆమెకు మొత్తం 3,216 రూబుల్స్, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,600 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
చదువు ఒత్తిడి ఉన్నప్పటికీ.. వారానికి కేవలం రెండుసార్లు మాత్రమే లభించే ఖాళీ సమయంలో ఈ పార్ట్‌టైమ్ పని చేస్తున్నట్లు దివ్యా చెప్పారు. అయితే, తన ప్రధాన లక్ష్యం మాత్రం వైద్య విద్య పూర్తి చేయడమే అని స్పష్టం చేశారు.
దివ్యా జోషి వీడియో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు.. స్టూడెంట్ వీసాపై విదేశాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడానికి అనుమతి ఉందా? దీనివల్ల చదువుకు ఇబ్బంది కలగదా? అంటూ ప్రశ్నలు సంధించారు.
దీనికి స్పందించిన దివ్యా.. తాను చేస్తున్న పని చట్టబద్ధంగా అనుమతించబడినదేనని, అలాగే క్లాసులు, ఆసుపత్రి శిక్షణ లేని సమయంలో మాత్రమే డెలివరీ పని చేస్తున్నట్లు వివరించారు.
విదేశాల్లో చదువుకుంటూనే.. స్వయం ఆధారంగా ఉండేందుకు పార్ట్‌టైమ్ పని చేస్తూ సంపాదిస్తున్న దివ్యా జోషి ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వాన్ని లక్షలాది మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చదువుతో పాటు స్వతంత్రంగా నిలబడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply