రాత్రంతా హాయిగా నిద్రపోయినప్పటికీ, ఉదయాన్నే నిద్రలేవగానే పూర్తిగా నీరసంగా అనిపించడం చాలా మందిని వేధించే సమస్య. పడుకోవాల్సిన సమయానికి పడుకున్నా, సరిపడా గంటల పాటు నిద్రపోయినా అలసట మాత్రం తగ్గదు. ఇది నిద్ర పరిమాణానికి (Quantity) సంబంధించిన సమస్య కాదు, నిద్ర నాణ్యతకు (Quality) సంబంధించిన సమస్య అని, దీనికి ప్రధాన కారణం ‘ఆందోళన’ (Anxiety) అని సైకోథెరపిస్ట్, లైఫ్ ఆల్కెమిస్ట్ డాక్టర్ చాందిని తుగ్నాయిత్ చెబుతున్నారు.
నాడీ వ్యవస్థ నిద్రపోదు (Nervous system is still awake):
డాక్టర్ చాందిని అభిప్రాయం ప్రకారం, మీరు నిద్రపోతున్నప్పుడు మీ నాడీ వ్యవస్థ వాస్తవానికి విశ్రాంతి తీసుకోవడం లేదు. ఆందోళన (Anxiety) ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు నిద్రపోతున్నప్పటికీ మీ నాడీ వ్యవస్థ అప్రమత్తంగానే ఉంటుంది. మీ శరీరం తెలియకుండానే ప్రమాద సంకేతాల కోసం వెతుకుతూ, బ్యాక్గ్రౌండ్లో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల ఆ నిద్ర కేవలం పేరుకు మాత్రమే నిద్ర అవుతుంది తప్ప, అది శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇవ్వదు.
శరీరం నిద్రపోతున్నా మనసు పనిచేస్తూనే ఉంటుంది:
“ఆందోళన అనేది మనసును వెనుక ఉండి నిరంతరం పనిచేయిస్తుంది. ఇది పీడకలల రూపంలోనో, రాత్రి పూట తరచుగా మెలకువ రావడం వల్లనో లేదా ఉదయాన్నే వింతైన అసౌకర్యంతో నిద్రలేవడం వల్లో బయటపడుతుంది” అని డాక్టర్ చాందిని పేర్కొన్నారు. ఇవి మిమ్మల్ని పూర్తిగా మేల్కొల్పకపోయినా, శరీరానికి శక్తినిచ్చే ‘డీప్ స్లీప్’ దశలను దెబ్బతీస్తాయి.
నిద్ర గురించి అతిగా ఆలోచించడం సమస్యను పెంచుతుంది:
“నిద్రపై ఆందోళన చెందడం ఒక విషవలయంలా మారుతుంది. సరిగ్గా నిద్ర పడుతుందో లేదో అని మీరు ఎంత ఆందోళన చెందితే, మీ మనసు అంతగా యాక్టివేట్ అవుతుంది. ఫలితంగా మీరు దేనిని తప్పించుకోవాలని చూస్తారో, అదే అశాంతితో కూడిన రాత్రి మీకు ఎదురవుతుంది” అని డాక్టర్ చాందిని వివరించారు.
ఏం చేస్తే మంచిది?
నిద్రను నియంత్రించాలని ప్రయత్నించడం కంటే, సహజంగా నిద్ర పట్టేలా వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం మంచిదని ఆమె సూచిస్తున్నారు.
నిద్రకు ముందు స్క్రీన్లు (ఫోన్, టీవీ) చూడకుండా ఉండటం.
పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం (Wind down).
కేవలం నిద్ర లక్షణాలపై కాకుండా, నిద్రకు ఆటంకం కలిగిస్తున్న అంతర్లీన ఆందోళన (Anxiety)ను తగ్గించుకోవడంపై దృష్టి సారించడం.
“శరీరాన్ని కచ్చితంగా నిద్రపోవాలని ఒత్తిడి చేయడం కంటే, దానికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వండి” అని ఆమె సూచించారు.
