8 నెలల కష్టం ఒక్క రోజులోనే బూడిదలో పోసిన పన్నీరైంది.. అయినా రెండోసారి నదిని శుభ్రం చేసిన బిట్టు.. చెత్తకుండీలను కూడా వదిలిపెట్టని జనం.. ప్రభుత్వాన్ని మాత్రమే నిందిస్తే ఏం లాభం..? ఆగ్రహం తెప్పించిన దొంగతనం..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో ఉన్న అజ్నార్ నదిని శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమైన 20 ఏళ్ల పర్యావరణ కార్యకర్త సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహిగా సుపరిచితుడు), తన ప్రయత్నంలో మళ్లీ ఒక ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు.

నదిని రెండోసారి శుభ్రం చేసిన ఆయన, నదీ తీరంలో ప్రజలు చెత్త వేయకుండా నిరోధించడానికి రెండు చెత్తకుండీలను ఏర్పాటు చేశాడు. అయితే, అందులో ఒక చెత్తకుండీ దొంగతనానికి గురైన ఘటన ప్రజల బాధ్యతారాహిత్యం, నదుల స్వచ్ఛత పనుల్లో ఎదురయ్యే సవాళ్లపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

సురేంద్ర సింగ్ చౌదరి ఎన్నో నెలల పాటు కష్టపడి అజ్నార్ నదిని శుభ్రపరిచాడు. అయినప్పటికీ, ప్రజలు మళ్లీ నది ఒడ్డున ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను పారవేయడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిట్టు, ప్రజలు వ్యర్థాలను నదిలో వేయకుండా ఉండేందుకు తీరంలోని ఓ చెట్టు వద్ద రెండు ప్లాస్టిక్ బ్యారెల్ డస్ట్‌బిన్లను అమర్చాడు.

కానీ, ఇటీవల ఆయన అక్కడికి వెళ్లి చూసేసరికి అందులో ఒక డస్ట్‌బిన్ కనిపించకుండా పోవడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. దీనిపై శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో విడుదల చేసిన బిట్టు, “ఈ చెత్తకుండీలను నేను నా స్వార్థం కోసం పెట్టలేదు; నది మళ్లీ కలుషితం కాకుండా ప్రజలు చెత్తను వేయడానికే ఏర్పాటు చేశాను. కానీ, ప్రజల సౌకర్యార్థం ఉంచిన బ్యారెళ్లను కూడా దొంగిలించారు” అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్, “ప్రజలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మళ్లీ ప్రతి తప్పుకూ మనం ప్రభుత్వాన్ని మాత్రమే నిందిస్తాం” అని కామెంట్ చేశారు.

మరో యూజర్ స్పందిస్తూ, “అందుకే మిమ్మల్ని పోలీసులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లు చేయమని చెప్పాను. లేకపోతే మీరు చేసే ప్రయత్నాలన్నీ వృథా అయిపోతాయి” అని పేర్కొన్నారు. మరికొందరు, “ప్రజలు తమ అలవాట్లను మార్చుకోనంత వరకు ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలు పూర్తి మార్పును తీసుకురావడం కష్టం” అని వ్యాఖ్యానించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఒంటరిగా పోరాడుతున్న ఒక యువకుడి ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, అతను ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌నే ఎత్తుకెళ్లిన ఈ నీచమైన ఘటన నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *