80 టన్నుల బరువు, 30 అడుగుల ఎత్తు ఉన్న 900 ‘మోవాయి’ విగ్రహాలు నడిచి వెళ్లడం ఎలా సాధ్యం? శాస్త్రవేత్తల అద్భుత వివరణ!

పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, మనుషులు లేని ఒక ఒంటరి ద్వీపంలో ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉండే భారీ రాతి విగ్రహాలు నిలబడి ఉన్నాయి. ‘ఈస్టర్ ఐలాండ్’ అని పిలిచే ఈ ప్రదేశంలో సుమారు 900 ‘మోవాయి’ (Moai) విగ్రహాలు గత 900 ఏళ్లుగా ఉన్నాయి.

సుమారు 80 టన్నుల బరువు, 30 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాలను, ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో కిలోమీటర్ల దూరం ఎలా తరలించారు అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగా ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి సమాధానాన్ని కనుగొన్నారు.

విగ్రహాలు నడిచాయా? అక్కడి స్థానిక ప్రజలైన ‘రాపా నూయి’ (Rapa Nui) వాసులను అడిగితే, వారు ఒక ఆసక్తికరమైన సమాధానం చెబుతారు: “ఆ విగ్రహాలు అవే నడిచి వెళ్లాయి” అని. మొదట్లో శాస్త్రవేత్తలు దీనిని ఒక కథగా భావించారు. విగ్రహాలను చెక్క దుంగలపై పడుకోబెట్టి దొర్లించుకుంటూ తీసుకెళ్లి ఉండవచ్చు అని వాదించారు. కానీ కొండల మార్గాల్లో అది సాధ్యం కాదని తేలిపోయింది.

బింగ్‌హామ్టన్ యూనివర్సిటీ మరియు అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో, ఆ విగ్రహాలు నిజంగానే ‘నడిచాయి’ అని 3D మోడలింగ్ ద్వారా నిరూపించారు. దీనిని శాస్త్రవేత్తలు ‘రాకింగ్’ (Rocking) టెక్నిక్ అని పిలుస్తారు.

నడిచే సాంకేతికత: విగ్రహాలను నిలువుగా ఉంచి, వాటి అడుగు భాగం స్వల్పంగా వంపు తిరిగేలా చెక్కారు. విగ్రహాల మెడ భాగానికి పొడవైన తాళ్లను కట్టి, ఇరువైపులా మనుషులు నిలబడి లాగారు. ఒక వైపు లాగినప్పుడు విగ్రహం ఒక పక్కకు వంగుతుంది, మళ్ళీ మరోవైపు లాగినప్పుడు రెండో వైపుకు వంగుతుంది. ఇలా అటు ఇటు ఊపుతూ ఉంటే విగ్రహం నెమ్మదిగా ముందుకు కదులుతుంది. మనం ఒక భారీ బీరువాను ఒక చోటు నుండి మరో చోటుకు జరుపుతున్నప్పుడు ఉపయోగించే సాంకేతికత వంటిదే ఇది.

విగ్రహాలు అక్కడే ఎందుకు ఉన్నాయి? ద్వీపం మొత్తం పరిశోధించినప్పుడు, ఎక్కడెక్కడ ఈ భారీ విగ్రహాలు ఉన్నాయో, అక్కడ భూగర్భ మంచినీటి ఊటలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రపు నీరు ఉప్పగా ఉన్నప్పటికీ, మంచినీరు లభించే ప్రదేశాలను గుర్తించడానికి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉండవచ్చు. అలాగే విగ్రహాల చుట్టుపక్కల మట్టి కూడా చాలా సారవంతంగా ఉండటాన్ని గమనించారు. విగ్రహాలను చెక్కేటప్పుడు రాలిన అగ్నిపర్వత శిలల పొడి మట్టిలో కలవడం వల్ల అక్కడ పంటలు బాగా పండినట్లు తెలుస్తోంది.


Posted

in

by

Tags: