“80ల నాటి లుక్‌లో ఫోటోలు దిగాలని ఆశపడుతున్నారా..? మీరు జనరేట్ చేసే ప్రతి AI ఫోటోకి నీళ్లు ఖర్చవుతాయన్న నిజం తెలుసా.?”

సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి రెట్రో లుక్‌లో తమ ఫోటోలను క్రియేట్ చేసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది.

వింటేజ్ దుస్తులు, పాతకాలపు హెయిర్‌స్టైల్స్, నాటి లైటింగ్ మరియు రెట్రో సినిమా పోస్టర్ల శైలిలో వేలాది మంది నెటిజన్లు తమ సరికొత్త AI ఫోటోలను రూపొందించి ఇంటర్నెట్‌లో తెగ షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ భారత్‌లోని సోషల్ మీడియా వేదికల్లోనూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటోంది.

అయితే స్క్రీన్‌పై కేవలం కొన్ని సెకన్లలోనే ఫోటో సిద్ధమైపోవడం వెనుక.. భారీ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఒక AI ఇమేజ్‌ను ప్రాసెస్ చేసి రూపొందించే క్రమంలో డేటా సెంటర్లలోని అత్యంత శక్తివంతమైన సర్వర్లు భారీ స్థాయిలో కాంపిటేషనల్ వర్క్‌ను (డేటా ప్రాసెసింగ్) నిర్వహిస్తాయి. దీని కారణంగా అవి విపరీతమైన ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఆ సర్వర్లను సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచేందుకు కూలింగ్ వ్యవస్థలు (శీతలీకరణ యంత్రాలు) నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.

ఇక్కడే నీటి వినియోగం గురించిన ఆందోళనలు మొదలవుతున్నాయి. కొన్ని డేటా సెంటర్లలో సర్వర్లను చల్లబరిచేందుకు వాటర్ కూలింగ్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనివల్ల AI వినియోగం పెరిగేకొద్దీ విద్యుత్ డిమాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి డిమాండ్ కూడా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం.. AI వర్క్‌లోడ్స్ కోసం వాడే నీటి పరిమాణంపై విభిన్న అంచనాలు ఉన్నాయి; ఒక ఫోటో తయారీకి ఖర్చయ్యే నీటి పరిమాణం అనేది ఆయా డేటా సెంటర్, వాడే విద్యుత్ వనరు మరియు కూలింగ్ విధానంపై ఆధారపడి మారుతుంటుంది.

ఒక్కరు ఒకే ఒక్క AI ఫోటో రూపొందించినంత మాత్రాన తక్షణమే పెను పర్యావరణ ముప్పు వాటిల్లుతుందని చెప్పలేం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో కోట్ల మంది నెటిజన్లు ఇలాంటి AI ఫోటోలను రూపొందించినప్పుడు.. ఆ చిన్న చిన్న పరిమాణాలన్నీ పోగై భారీ కంప్యూటింగ్ వనరుల వినియోగానికి, పర్యావరణ భారానికి దారితీస్తాయి. అందుకే AI సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ అది విద్యుత్, నీరు మరియు పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం.


Posted

in

by

Tags: