న్యూఢిల్లీ: దక్షిణ లెబనాన్ లోని యోహోమోర్ గ్రామ ఆకాశం నుండి అగ్నిగోళాలు కురిసినప్పుడు, అవి కేవలం బాంబులు మాత్రమే కాదు.. అవి ‘తెల్లటి మృత్యువు’ చేసిన తాండవం. హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే నెపంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి ‘వైట్ ఫాస్ఫరస్’ ఉపయోగించిందని ఆరోపణలు వస్తున్నాయి.
హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) సంస్థ విడుదల చేసిన నివేదిక మరియు ఫోటోలు ఈ వివాదాస్పద ఆయుధ వినియోగాన్ని ధృవీకరిస్తూ ప్రపంచాన్ని షాక్ కు గురిచేశాయి.
ఏమిటీ ‘తెల్లటి మృత్యువు’ (వైట్ ఫాస్ఫరస్)?
వైట్ ఫాస్ఫరస్ అనేది సాధారణ పేలుడు పదార్థం కాదు, ఇది అత్యంత భయంకరమైన రసాయనిక పదార్థం. మైనంలా కనిపించే ఈ రసాయనం గాలితో తాకగానే ఆక్సిజన్ తో కలిసి దానంతట అదే మండుతుంది. ఇది సుమారు 815°C ఉష్ణోగ్రతను పుట్టిస్తుంది.
మనిషి శరీరం 50-60 డిగ్రీల వేడికే తట్టుకోలేదు. అలాంటిది 815 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే అది సాక్షాత్తు యమధర్మరాజుతో సమానం. ఈ రసాయనం చర్మంపై పడగానే మాంసాన్ని కరిగిస్తూ నేరుగా ఎముకల వరకు చేరుకుంటుంది. దీని వల్ల కలిగే గాయాలు ఎప్పటికీ మానవు. దీని నుండి వచ్చే పొగ ఊపిరితిత్తులను ఎంతగా దెబ్బతీస్తుందంటే, మనిషి నిమిష నిమిషానికి నరకం అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోతాడు.
దగ్ధమవుతున్న భవనాలు – ఆర్తనాదాలు
యోహోమోర్ వంటి జనావాసాల మధ్య ఇజ్రాయెల్ సైన్యం ఈ ఫాస్ఫరస్ ను ప్రయోగించిందని HRW పరిశోధకుడు రామ్జీ కైస్ తెలిపారు. జనం ఖాళీ చేయాలని హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ అంటున్నప్పటికీ, భూస్థాయిలో ఆ సమయంలో ఎంతమంది పౌరులు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. శత్రువుల కళ్ళను గప్పి పుచ్చడానికి ‘స్మోక్ స్క్రీన్’ (పొగ తెర) కోసమే దీనిని వాడతామని ఇజ్రాయెల్ వాదిస్తుంది. కానీ పౌరుల మధ్య దీనిని వాడటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ‘యుద్ధ నేరం’ (War Crime) కిందకు వస్తుంది.
మానవీయ సంక్షోభం
లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మార్చి 2, 2026 నుండి మార్చి 8, 2026 మధ్య జరిగిన దాడుల్లో:
మొత్తం మరణాలు: 400 (వీరిలో 83 మంది పిల్లలు, 42 మంది మహిళలు ఉన్నారు)
గాయపడిన వారు: 1130 కి పైగా
ప్రధాన లక్ష్యాలు: దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీ మరియు బీరూట్ లోని జనావాస ప్రాంతాలు.
దీనిని తీవ్రమైన మానవీయ సంక్షోభంగా లెబనాన్ ఆరోగ్య మంత్రి రాకాన్ నాస్రెద్దీన్ అభివర్ణించారు. ఈ కెమికల్ వల్ల ప్రాణాలతో బయటపడిన వారికి కూడా భవిష్యత్తులో అవయవాలు విఫలమవ్వడం (Organ Failure) వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
