దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు మరియు ఇతర కనీస సౌకర్యాలను సక్రమంగా కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
రైల్వే స్టేషన్లలో తగిన కనీస సౌకర్యాలు లేవని కాగ్ (CAG – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ – PIL) దాఖలైంది. పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రయాణికులకు నిజమైన వసతులు అందేలా చూడాలని అందులో కోరారు.
గతంలో కాగ్ నిర్వహించిన అధ్యయనంలో, దేశవ్యాప్తంగా ఉన్న 512 రైల్వే స్టేషన్లలో 458 స్టేషన్లలో తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, దారి చూపే సైన్ బోర్డులు లాంటి అత్యవసర సౌకర్యాలు లేవని తేలింది. అంటే, సుమారు 89 శాతం రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల కొరత ఉందని, కేవలం 11 శాతం స్టేషన్లలో మాత్రమే పూర్తిస్థాయి సౌకర్యాలు ఉన్నాయని ఆ నివేదికలో ఎత్తిచూపారు.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారమ్‌లపై షెడ్లు, ఫ్యాన్లు, వైద్య సదుపాయం, చెత్త నిర్వహణ తదితర వసతులను రైల్వే యంత్రాంగం తప్పనిసరిగా కల్పించి తీరాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, కాగ్ ఆడిట్ నివేదికలో పేర్కొన్న సిఫార్సులన్నింటినీ తక్షణమే అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసును ముగించింది.

Leave a Reply