కష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని నిరూపించిన ఓ యువకుడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల క్రితం స్నేహితులకు తెలియకుండా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసిన బెంగళూరుకు చెందిన కౌశిక్ ఖార్వి.. ఇప్పుడు అదే నగరంలో సొంత సీఫుడ్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ఇటీవల గూగుల్ ఫోటోస్‌లో తన పాత జ్ఞాపకాలను చూస్తున్న సమయంలో కౌశిక్‌కు తన కష్టకాలం నాటి ఫొటోలు కనిపించాయి. అప్పట్లో పార్ట్‌టైమ్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సమయంలో తీసుకున్న ఫొటోలతో పాటు, తన పాత ఐడీ కార్డును కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ కౌశిక్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
“కష్టపడి పనిచేయడం కంటే.. నా స్నేహితులు నన్ను డెలివరీ బాయ్‌గా ఎక్కడ చూసేస్తారో అన్న భయమే నాకు ఎక్కువగా ఉండేది. అందుకే వారికి తెలియకుండా దాక్కుంటూ ఫుడ్ డెలివరీలు చేసేవాడిని” అంటూ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
అయితే కాలం మారింది. ఒకప్పుడు బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ తీసుకెళ్లేందుకు ఎదురుచూసిన కౌశిక్.. ఇప్పుడు అదే నగరంలో ‘మంగళూరు ఇన్ బెంగళూరు’ పేరుతో సొంత సీఫుడ్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.
తన కష్టకాలంలో ఉద్యోగ అవకాశం కల్పించిన స్విగ్గీ సంస్థకు, తన ఎదుగుదలకు అండగా నిలిచిన కస్టమర్లకు, తన టీమ్ సభ్యులకు కౌశిక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఒకప్పుడు స్నేహితులకు కనిపించకుండా డెలివరీలు చేసిన వ్యక్తి.. తొమ్మిదేళ్ల తర్వాత సొంత రెస్టారెంట్‌కు యజమానిగా ఎదిగిన ఈ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
కష్టపడుతున్న సమయంలో మన పని చిన్నదైనా.. దాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే ఒకరోజు అదే పని మన విజయానికి పునాది కావచ్చని కౌశిక్ కథ చెబుతోంది.

Leave a Reply