చిత్రపరిశ్రమ, క్రికెట్ ప్రపంచం కలిసి ఒక కొత్త ప్రేమ జంటను సృష్టించాయనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.
బాలీవుడ్ స్టార్ నటి మృణాళ్ ఠాకూర్, భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. ముంబైలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ నుండి ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తీసినదిగా చెబుతున్న ఆ వీడియోలో, క్రికెటర్ యశస్వి జైస్వాల్ అక్కడి నుండి బయటకు వెళ్లడం, నటి మృణాళ్ ఠాకూర్ లోపల ఉండడం రికార్డైంది. అయితే, ఆ వీడియోలో వారిద్దరూ కలసి మాట్లాడటం గానీ, జంటగా తిరగడం గానీ ఉన్న దృశ్యాలేవీ లేవు. అయినప్పటికీ, ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో వీరిద్దరూ యాదృచ్ఛికంగా కనిపించడమే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇప్పటివరకు మృణాళ్ ఠాకూర్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ ఈ వార్తలను ధృవీకరించలేదు. ఇది ప్రేమ కంటే ఒక ప్రకటన చిత్రీకరణ కోసం లేదా వృత్తిపరమైన భేటీ కోసం కూడా అయి ఉండవచ్చని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, 33 ఏళ్ల మృణాళ్ ఠాకూర్‌కు, 24 ఏళ్ల యశస్వి జైస్వాల్కూ మధ్య ఉన్న 9 ఏళ్ల వయసు వ్యత్యాసంపై కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా చర్చిస్తున్నారు. గతంలో నటుడు ధనుష్‌తో మృణాళ్ ఠాకూర్ పేరును ముడిపెట్టి పుకార్లు వచ్చినప్పుడు, ఆమె వాటిని పూర్తిగా ఖండించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ హిందీ, తెలుగు సినిమాల్లో బిజీగా నటిస్తుండగా, యశస్వి జైస్వాల్ టీమిండియాలో కీలక ఓపెనర్‌గా రాణిస్తున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వేళ, ఈ సడన్ లవ్ రూమర్స్‌పై ఇరు వర్గాల నుండి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఒక సాధారణ భేటీని చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఈ సమాచారంతో, ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

Leave a Reply