ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయి జిల్లాలో ఓ మహిళపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు వివాహం జరిగి, 9 మంది పిల్లలు ఉన్న ఓ మహిళ.. మరో వ్యక్తితో కలిసి తన భర్తను నిర్బంధించి తీవ్రంగా అవమానించిందని ఆరోపణలు వచ్చాయి.
హర్డోయి జిల్లాకు చెందిన సోనియా యాదవ్, నరేంద్రకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ కలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వ్యతిరేకతను పట్టించుకోకుండా గురుగ్రామ్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారని కథనం పేర్కొంది.
దాదాపు రెండున్నరేళ్ల పాటు నరేంద్ర ఆమెతో కలిసి జీవించాడు. అయితే ఆ తర్వాత సోనియాకు గతంలోనే రెండు వివాహాలు జరిగాయని, ఆమెకు 9 మంది పిల్లలు ఉన్నారని నరేంద్రకు తెలిసినట్లు సమాచారం.
గత జూలైలో సోనియాకు అనారోగ్యం రావడంతో ఆమె కోరిన మేరకు నరేంద్ర ఆమెను గౌరీకాట్ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగించినట్లు కథనం పేర్కొంది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 25న నరేంద్ర సోనియాను కలిసినప్పుడు ఆమె ఫోన్‌ను పరిశీలించాడు. అందులో మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించినట్లు నరేంద్ర ఆరోపించాడు. అంతేకాకుండా సోనియా ఐదు నెలల గర్భంతో ఉన్న విషయం కూడా బయటపడటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో నరేంద్ర తనపై దాడి చేశాడని సోనియా ఆరోపించినట్లు కథనం చెబుతోంది.
అనంతరం సోనియా మరో వ్యక్తితో కలిసి నరేంద్రను నిర్బంధించి, అతనిపై దాడి చేసి అవమానించారని నరేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అతని తలకు సగం గుండు కొట్టి, సగం మీసం తొలగించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా తెలిసేలా అవమానించారని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు.. నరేంద్ర చేతులు జోడించి ఏడుస్తూ తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడు నరేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం సోనియా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Leave a Reply