పరీక్షా ఫలితాలు అంటేనే ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో విద్యార్థుల రెండు భిన్నమైన మనస్తత్వాలను చాలా సరదాగా చిత్రీకరించి చూపిస్తోంది.
ఆ వీడియోలో, ఒక విద్యార్థిని 90 శాతం మార్కులు సాధించినప్పటికీ, తాను ఆశించిన మార్కులు రాలేదన్న బాధతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయితే, అదే వీడియోలోని తర్వాతి దృశ్యంలో ఒక విద్యార్థి కేవలం 60 శాతం మార్కులు వచ్చినందుకే, ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచినట్లు చేతిలో మిఠాయిల పెట్టెతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నాడు.
అక్కడ ఉన్న ఒక మహిళ, “తమ్ముడూ, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా?” అని అడగగా, ఆ విద్యార్థి ఏమాత్రం బెరుకు లేకుండా తన అమాయకపు నవ్వుతో “అవును” అని సమాధానం ఇస్తాడు.
“జీవితం అనేది కేవలం మార్కుల్లో లేదు, మనం దాన్ని ఎలా స్వీకరిస్తాం అనే దానిలోనే ఉంది” అని ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, “చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషాన్ని వెతుక్కునే అబ్బాయిల స్టైలే వేరు” అంటూ ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
