“92 కోట్లా..?” కేంద్ర మంత్రుల ఇళ్లలో ఏం జరుగుతోంది..? ఢిల్లీ బంగ్లాల మరమ్మతులపై ఆర్టీఐ (RTI) ద్వారా బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలు!

న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల ఆధునీకరణ, మరమ్మతుల కోసం అయిన ఖర్చు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లకు చేరింది.

సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 27.47 కోట్లుగా ఉన్న ఈ వార్షిక వ్యయం, ప్రస్తుతం మూడు రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమైంది.

కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) ద్వారా 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో కేవలం కేంద్ర మంత్రుల బంగ్లాల నిర్వహణ కోసమే మొత్తం రూ. 547.68 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ లుటియన్స్ బంగ్లాలు దాదాపు 80 నుంచి 100 ఏళ్ల నాటి పాతవి కావడంతో, వాటి భవనాల పటిష్టత, మరమ్మతులు, చెదల నివారణ మరియు నీటి లీకేజీల సమస్యల వల్లే ఖర్చులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

బ్రిటిష్ పాలనలో 1912 నుంచి 1930 మధ్య కాలంలో నిర్మించిన ఈ లూటియన్స్ జోన్ బంగ్లాల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు నివసిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సుమారు 70 నుంచి 72 మంది మంత్రులను పరిగణనలోకి తీసుకుంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మంత్రి నివాస నిర్వహణకు సగటున రూ. 1.2 కోట్ల వరకు ఖర్చయింది.

2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏడాదికి సగటున రూ. 26.78 కోట్లుగా ఉన్న మెయింటెనెన్స్ ఖర్చు, 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏటా సగటున రూ. 50 కోట్లకు చేరి రెట్టింపైంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 71.98 కోట్లకు ఎగబాకగా, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 92.35 కోట్ల మార్కును తాకింది.

సాధారణంగా ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్ల మార్పు, ప్లంబింగ్ పనులు, ఫ్లోరింగ్ టైల్స్ మార్చడం వంటి చిన్నచిన్న పనుల కోసమే అత్యధికంగా డిమాండ్లు వస్తుంటాయని సిబ్బంది పేర్కొంటున్నారు. ఎంపీల ఇళ్ల నిర్వహణ ఖర్చులపై స్పష్టమైన వివరాలు వెల్లడించనప్పటికీ, మంత్రుల బంగ్లాల కోసం అవుతున్న నిర్వహణ వ్యయం ఏటేటా భారీగా పెరుగుతుండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *