బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక మాంత్రికుడు, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా ప్రాంతంలో తల నరికిన స్థితిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
గత కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి మొండెం మాత్రమే లభించడంతో, పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ముగింపులో, ఆ మృతదేహం ఒక మాంత్రికుడిదని, అతడిని ప్లాన్ ప్రకారమే హత్య చేశారని తేలింది. ఈ దారుణ హత్య ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల వేగవంతమైన విచారణలో, ఈ హత్య వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హతుడైన మాంత్రికుడి భార్యకు వేరే ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వీరి ప్రేమకు భర్త అడ్డుగా ఉండటంతో, అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని భార్య, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు తమ స్నేహితులు కొందరిని కూడా ఈ కుట్రలో భాగస్వామ్యులను చేసి, వారి ఇ ఇంటి నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా ప్రాంతానికి అతడిని రప్పించారు.
మాంత్రిక పూజ (చేతబడి) పని ఉందని నమ్మించి తీసుకువెళ్లిన అతడిపై, అక్కడ పొంచి ఉన్న ప్రియుడు మరియు అతని అనుచరులు అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత, హంతకులు అతని తలను నరికివేసి, మొండెం అక్కడే పడేసి పారిపోయారు. ఘటన జరిగిన కేవలం రెండు రోజుల్లోనే, సాంకేతిక ఆధారాలు మరియు రహస్య సమాచారం సాయంతో పోలీసులు హంతకులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మాంత్రికుడి భార్య, ఆమె ప్రియుడు మరియు హత్యకు సహకరించిన అనుచరులతో కలిపి మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
