సంచలన తీర్పు: తల్లిదండ్రులను పోషించని పిల్లలకు పెద్ద షాక్: వృద్ధులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకుకు జైలు, జరిమానా!

ముంబై: తల్లిదండ్రులను పోషించే బాధ్యత నుంచి తప్పించుకుంటున్న పిల్లలకు కోర్టు గట్టి హెచ్చరిక పంపింది. మహారాష్ట్రలోని జున్నార్ జిల్లా కోర్టు, వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఒక కొడుకుకు 3 నెలల జైలు శిక్షతో పాటు ₹5,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారిని రోడ్డు మీద వదిలేసే అమానవీయ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

బాధితుల ఫిర్యాదు ప్రకారం, “మా ఇద్దరు కొడుకులు మా వ్యవసాయ భూమిని లాక్కున్నారు. కనీస అవసరాలు కూడా అందించకుండా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న కొడుకు మమ్మల్ని చూసుకుంటానని వాగ్దానం చేయడంతో, 51 గుంటల భూమిని అతని పేరు మీద రిజిస్టర్ చేశాం. కానీ అతను కూడా మమ్మల్ని వెళ్లగొట్టి, మా వద్ద నుంచి డబ్బు కూడా తీసుకున్నాడు” అని 70 ఏళ్ల దంపతులు 2023 మే 13న కోర్టులో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన కోర్టు, చిన్న కొడుకు వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉన్నట్లు నిర్ధారించింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఆదేశించిన కోర్టు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినందుకు గాను ఆ కొడుకుకు 3 నెలల జైలు శిక్ష మరియు ₹5,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Posted

in

by

Tags: