చెన్నైలోని కంటోన్మెంట్ పల్లవరం మల్లికా నగర్‌కు చెందిన క్లింటన్ (30), షేర్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నాడు.
కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఎలా సంపాదించాలి అనే అంశంపై క్లింటన్ చర్చా కార్యక్రమాలలో పాల్గొనేవాడు.
క్లింటన్ యూట్యూబ్ వీడియోలు చూసిన చాలా మంది అతడిని సంప్రదించి సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు.
రూ. 1.5 కోట్ల మోసం
చెన్నై విల్లివాక్కం ప్రాంతానికి చెందిన మోహనప్రియ (35) కూడా క్లింటన్ వద్ద షేర్ మార్కెట్ పెట్టుబడుల గురించి సలహా తీసుకుంది.
క్లింటన్ సూచనల మేరకు మోహనప్రియ వివిధ వాయిదాలలో అతడికి రూ. 75 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.
కొన్నాళ్లకు క్లింటన్, పెట్టుబడి పెట్టిన డబ్బును షేర్ మార్కెట్లో కోల్పోయానని మోహనప్రియకు చెప్పాడు.
కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించడానికి అదనపు డబ్బు అవసరం అని చెప్పగా, మోహనప్రియ తన ఆడి కారును అమ్మి రూ. 12 లక్షలు, అలాగే ఆస్తిని తాకట్టు పెట్టి మరో రూ. 40 లక్షలు తీసుకువచ్చి అతడికి ఇచ్చింది.
ఈ విధంగా మోహనప్రియ నుంచి సుమారు రూ. 1.5 కోట్ల డబ్బును తీసుకున్న క్లింటన్, ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మోహనప్రియ పల్లవరం పోలీస్ స్టేషన్లో క్లింటన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. తనలాగే మరికొంత మందిని కూడా క్లింటన్ మోసం చేశాడని, అతనిపై చర్య తీసుకోవాలని ఆమె కోరింది.
పెళ్లి మండపం వద్ద హైడ్రామా
ఈ నేపథ్యంలో, క్లింటన్‌కు పల్లవరం రేడియల్ రోడ్డులో ఉన్న ఒక పెళ్లి మండపంలో కొద్ది రోజుల క్రితం అట్టహాసంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.
పెళ్లి మండపం ముందు పెట్టిన క్లింటన్ ఫోటోలతో కూడిన బ్యానర్లను చూసి, అతడికి డబ్బు ఇచ్చి మోసపోయిన బాధితులు అందరూ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు క్లింటన్‌ను పెళ్లి మండపం లోపల తరిమి కొట్టడానికి ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో భారీ గందరగోళం నెలకొంది.
