ముంబై : ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథల సినిమాలు, కథలు, నవలలు వచ్చాయి. అమర ప్రేమికులుగా నిలిచిన కొన్ని పాత్రలు శతాబ్దాలు గడిచినా ప్రజల మనసుల్లో నిలిచి, కన్నీళ్లు పెట్టిస్తాయి.
ఇప్పుడు మీరు వినబోయే ఈ నిజమైన ప్రేమ కథ వింటే మీరు ఒక క్షణం భావోద్వేగానికి లోనవ్వడం ఖాయం. మహారాష్ట్రలోని నాందేడ్‌లో, 20 ఏళ్ల యువకుడిని కులం పేరుతో కొట్టి, కాల్చి, చివరికి తలను బండరాయితో చితికిలగొట్టి దారుణంగా హత్య చేశారు . ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రియురాలు… ఆ మృతదేహంతోనే పెళ్లి చేసుకుని, నుదుటిపై సింధూరం ధరించి, ఇకపై అతని ఇంట్లోనే కోడలిగా జీవిస్తానని శపథం చేసింది. ప్రస్తుతం వీరి ఈ ప్రేమ కథ చూసి చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు.
చనిపోయిన యువకుడిని సక్షమ్ టేట్గా గుర్తించారు. అతని ప్రియురాలు ఆంచల్, ఇకపై అతని జ్ఞాపకాలతోనే జీవిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సక్షమ్ టేట్‌తో ఆంచల్కి పరిచయం ఆమె సోదరుల ద్వారానే జరిగింది. కానీ ఇప్పుడు, వారే సక్షమ్ టేట్ మరణానికి కారణమయ్యారు.
ఘటన వివరాలు
పరస్పరం పరిచయమున్న ఆంచల్, సక్షమ్ టేట్ల మధ్య క్రమంగా స్నేహం చిగురించింది. అప్పుడప్పుడు వీరు కలుసుకునేవారు. ఆ తరువాత వారి బంధం మరింత బలపడింది. వారి ఈ మూడేళ్ల ప్రేమకు ఇటీవల ఆంచల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రారంభించారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో, ఆంచల్ కుటుంబం వారి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, ఆంచల్, టేట్ల ప్రేమ కొనసాగుతూనే ఉంది.
త్వరలోనే ఆంచల్, టేట్‌తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోందనే విషయం ఎలాగో ఆమె సోదరుల ద్వారా తండ్రికి తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి గురువారం (నవంబర్ 27) టేట్‌పై దాడి చేసి, అతని తలపై కాల్చి, ఆపై తలను బండరాయితో పుడిపుడి చేసి హత్య చేశారు.
టేట్ హత్య గురించి తెలుసుకున్న ఆంచల్ కుప్పకూలిపోయింది. చివరికి, అంత్యక్రియలు జరుగుతున్న అతని ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన సంఘటనలు అందరి కళ్లలో నీళ్లు తెప్పించాయి. తన ప్రియుడి మృతదేహం వద్దకు వచ్చిన ఆంచల్… అతనికి పసుపు రాసి, తన నుదుట సింధూరం ధరించింది. ఆ విధంగా, మృతదేహంతోనే పెళ్లి బంధాన్ని ఏర్పరచుకుంది. ఇకపై అతని భార్యగా అక్కడే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. “మా ప్రేమ గెలిచింది. మా నాన్న, అన్నదమ్ములు ఓడిపోయారు” అని ఆమె చెప్పింది. అంతేకాకుండా, టేట్‌ను చంపినవారికి మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసింది. టేట్ మరణించినా, తమ ప్రేమ శాశ్వతం అని ఆమె చాటి చెప్పింది.
పోలీసులు ఇప్పటికే ఆరుగురిపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, టేట్ హంతకులకు కఠిన శిక్ష పడాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
