థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వాహనం ఉంటే ఈ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

మీకు డ్రైవింగ్ చేయడం ఇష్టమైతే లేదా కారు నడపడం మీ దైనందిన జీవితంలో భాగమైతే, ఈ రోజుల్లో రోడ్డుపై ఏమి జరగవచ్చో మీకు ఖచ్చితంగా తెలుసు. ఎవరు – ఎప్పుడు – ఎక్కడ – ఎలా అడ్డువస్తారో చెప్పలేము, మరియు దీని వలన ఢీకొని, వాహనం దెబ్బతింటే ఏమి చేయాలి? అటువంటి పరిస్థితిలో, మీ వద్ద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (TPI) ఉండాలి. కానీ ఈ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, అది మీకు ఎందుకు ముఖ్యమైనది అనే విషయాలను తెలుసుకోవాలి.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మోటార్ వెహికల్స్ యాక్ట్ అంటే మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతదేశంలోని అన్ని కార్లు మరియు ద్విచక్ర వాహనాలకు టిపిఐ అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయినప్పటికీ, చాలా మంది వాహనదారులు ఈ ఇన్సూరెన్స్ తీసుకోరు.

భారతదేశ రహదారులపై ఉన్న మొత్తం వాహనాలలో సుమారు 50 శాతం వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదని స్వయంగా భారత ప్రభుత్వం 2023లో పేర్కొంది.

ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం అంటే నియమాన్ని ఉల్లంఘించడమే కాకుండా, వాహనదారుడు మరియు బాధితుడు ఇద్దరికీ సమస్యలు సృష్టిస్తుంది.

ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏమిటి?

ఇందులో ఫస్ట్ పార్టీ అంటే పాలసీదారు లేదా ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే వ్యక్తి.సెకండ్ పార్టీ – ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ.థర్డ్ పార్టీ – క్లెయిమెంట్‌ అంటే ఫస్ట్ పార్టీ కారణంగా నష్టం జరిగిందని దావా వేసే వ్యక్తి. అంటే, సంక్షిప్తంగా, మీ కారు లేదా టూ వీలర్ కారణంగా ఎవరికైతే నష్టం జరిగిందో ఆ వ్యక్తి.

ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ – ఈ మూడవ వ్యక్తికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి తీసుకోబడుతుంది. అంటే, మీ వాహనం కారణంగా మరొక వ్యక్తికి గాయం అయినా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, దానితో పాటు ఎదుటివారి కారు లేదా మోటార్‌సైకిల్ నష్టం, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలకు జరిగిన నష్టం కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా భర్తీ చేయబడుతుంది.

బీమా దావా ఎవరు చేయవచ్చు?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో బీమా దావా థర్డ్ పార్టీ – అంటే ఎవరితోనైతే ప్రమాదం జరిగిందో ఆ వ్యక్తి దాఖలు చేస్తారు. వారు ఏమంటారంటే, ఫస్ట్ పార్టీ – బీమాదారుడు – కారణంగా జరిగిన నష్టాన్ని సెకండ్ పార్టీ అంటే బీమా కంపెనీ భర్తీ చేయాలని.

Getty Images

ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ‘ఎ’ అనే వ్యక్తి – ‘ఎక్స్’ కంపెనీ నుండి థర్డ్ పార్టీ బీమా తీసుకున్నారు. ఈ వ్యక్తి కారు ‘బి’ అనే వ్యక్తి కారును ఢీకొట్టింది. దీనివల్ల కారుకు నష్టం జరిగింది. ఇప్పుడు నిజానికి ‘ఎ’ అనే వ్యక్తి తప్పు అయితే, ఆ నష్టాన్ని ఆ వ్యక్తి భర్తీ చేయాలి. కానీ ‘ఎ’ అనే వ్యక్తి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నందున ‘బి’ అనే వ్యక్తికి ‘ఎక్స్’ కంపెనీ నుండి నష్టపరిహారం లభించవచ్చు.

కానీ ఒక విషయం గుర్తుంచుకోండి – మీ వాహనం దెబ్బతినడం లేదా మీకు అయిన గాయం ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. దీని కోసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మొత్తంగా, వాహనదారులకు ఈ ఇన్సూరెన్స్ ముఖ్యమైనది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోరు?

ప్రజలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోరు? వేర్వేరు కారణాలు ఉన్నాయి. చాలా మంది ఈ ఇన్సూరెన్స్ ఖరీదైనది అంటారు. కొందరికి తమ డ్రైవింగ్ నైపుణ్యంపై చాలా నమ్మకం ఉంటుంది. తమ వల్ల ఎప్పుడూ అలాంటి తప్పు – అలాంటి ప్రమాదం జరగదని వారు అనుకుంటారు. మరికొందరేమో – టిపిఐ కోసం అయ్యే ఖర్చులో ఒక డ్రైవర్‌ను పెట్టుకోవచ్చు అని అంటారు.

ఇందులో మరో రకం కూడా ఉంది. ప్రజలు మొదట్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ ఈ సమయంలో ఎప్పుడూ అవసరం పడలేదు – డబ్బు వృథా అయ్యింది – అని చెప్పి దానిని రెన్యూవల్ చేయరు – కొత్త పాలసీ తీసుకోరు. మరియు టిపిఐ తప్పనిసరి అని చాలా మందికి తెలియదు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 146లో ఇది చెప్పబడింది. ఈ సెక్షన్‌ను ఉల్లంఘించి – అంటే ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడుపుతూ పట్టుబడితే – దాని కోసం 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మరియు మీ కారణంగా ప్రమాదం జరిగితే – మరింత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.

థర్డ్ పార్టీ బీమా కింద ఏమేమి కవర్ అవుతాయి?

మరి ఈ థర్డ్ పార్టీ బీమా కింద ఏమేమి కవర్ అవుతాయి?

  • శారీరక గాయం
  • హాస్పిటల్ ఖర్చు
  • ఆదాయానికి జరిగిన నష్టం
  • ఆస్తికి జరిగిన నష్టం

వీటి పరిహారం ఈ బీమా కింద లభిస్తుంది. కానీ దీని కోసం ఏ విషయాలు అవసరం? ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి తెలియజేయడం పాలసీదారుని బాధ్యత. ఈ ప్రమాదం గురించి మొత్తం అవసరమైన సమాచారం – ఖచ్చితంగా ఏమి జరిగింది దాని వివరణ, అక్కడ ఎవరు ఉన్నారు, సమయం, తేదీ, స్థలం యొక్క సరైన నమోదు ముఖ్యమైనది.

  • డ్రైవర్, ప్రయాణీకులు మరియు ఆస్తి లేదా వాహనానికి ఎంత నష్టం జరిగింది దాని వివరాలు
  • ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తుల గురించిన సమాచారం
  • ప్రమాదం జరిగినప్పటి వాతావరణం లేదా పరిస్థితి
  • ప్రమాదం గురించిన ఫోటోలు – వీడియోలు
  • ఫిర్యాదు దాఖలు చేసి ఉంటే ఎఫ్‌ఐఆర్

ఈ విషయాలన్నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు అవసరం.

ఎన్‌సిఆర్‌బి (NCRB) గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 4 లక్షల 80 వేల 583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1 లక్ష 72 వేల 890 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల 62 వేల 825 మంది గాయపడ్డారు.

టిపిఐ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పరిహారం మొత్తంపై పరిమితి లేదు. అంటే మీకు కొన్ని లక్షలు లేదా కోట్లు చెల్లించాల్సి వస్తే, బీమా కంపెనీ ఆ డబ్బును పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆస్తి విషయంలో దీని గరిష్ట పరిమితి 7.5 లక్షలు.

టిపిఐ కవర్‌ను ఎప్పుడు తిరస్కరించవచ్చు?

కానీ ప్రతిసారీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మొత్తం లభిస్తుందా, అంటే ఈ ప్రశ్నకు సమాధానం ‘లేదు’ అని చెప్పాలి. మరి మీ టిపిఐ కవర్‌ను ఎప్పుడు తిరస్కరించవచ్చు?

  • మీరు మత్తులో, మద్యం ప్రభావంలో వాహనం నడుపుతున్నారని నిరూపించబడితే.
  • మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి ఉంటే.

అటువంటి సందర్భాలలో బీమా కంపెనీలు మీకు కవరేజ్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఇందులో చివరి నిర్ణయం కోర్టుదే. కానీ చాలా సందర్భాలలో మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం వలన మీ జేబు నుండి లక్షల ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. ఇది ఒక ఆర్థిక ఆధారం.


Posted

in

by

Tags: