షామ్లీ: బుర్కా ధరించలేదన్న నెపంతో ఒక మతోన్మాద భర్త తన ఇద్దరు కుమార్తెలను, భార్యను హత్య చేసి ఇంటిలోనే పాతిపెట్టిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది. షామ్లీలో జరిగిన ఈ ముగ్గురు హత్యల కేసు సంచలనం సృష్టిస్తోంది. బుర్కా ధరించే విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే నిందితుడు తన భార్యను, ఇద్దరు కుమార్తెలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
నిందితుడు ఫరూక్ హత్యల అనంతరం తన ఇంటిలోనే గొయ్యి తీసి మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పొరుగువారు ఆ మహిళ మరియు ఆమె కుమార్తెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. అధికారులు ఈ ఘటనను గృహహింస మరియు పరువు హత్యల కలయికగా పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫరూక్ ను అరెస్ట్ చేశారు. ఇంటి ఆవరణలో ఏడు అడుగుల లోతు గొయ్యి తీసి ముగ్గురి మృతదేహాలను పాతిపెట్టినట్లు గుర్తించారు. నిందితుడిని కంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్ గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం: ఫరూక్ భార్య తాహిరా (32) బుర్కా ధరించకుండా తన పుట్టింటికి వెళ్లిందని, ఆ విషయంలో గొడవ జరిగి భార్యను చంపేశాడు. ఆ సమయంలో కుమార్తెలు అఫ్రీన్ (14), సెహ్రీమ్ (7) ఈ హత్యను చూడటంతో వారిని కూడా చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఫరూక్ తన తల్లిదండ్రుల నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు కాగా, ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
డిసెంబర్ 9-10 రాత్రి ఈ హత్యలు జరిగినట్లు ఎస్పీ ఎన్.పి. సింగ్ తెలిపారు. టీ చేసే నెపంతో భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను మరియు పెద్ద కుమార్తెను తుపాకీతో కాల్చి చంపాడు. అది చూసిన చిన్న కుమార్తెను గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ నేరాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని, ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి ఇటుకలతో మూసివేశాడు. ప్రస్తుతం మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టంకు తరలించారు.
