జైపూర్ జల్ మహల్: భారతదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్ని విజయానికి గుర్తుగా, మరికొన్ని నిధిని దాచడానికి నిర్మించబడ్డాయి. కానీ జైపూర్‌లోని ‘జల్ మహల్’ మాత్రం రాణుల విహారం మరియు స్నానాల కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది. దాదాపు 300 ఎకరాల్లో విస్తరించి, 4 మీటర్ల లోతు ఉన్న ‘మాన్ సాగర్’ సరస్సు మధ్యలో ఈ అద్భుతం కొలువై ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మహల్ లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు, పర్యాటకులు దీనిని బయటి నుండి మాత్రమే చూడగలరు.
నీటిలో తేలే అద్భుతం:
జైపూర్ జల్ మహల్ ఒక ఇంజనీరింగ్ వింత. ఈ 5 అంతస్తుల భవనంలో 4 అంతస్తులు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి. బయటకు కేవలం పై అంతస్తు మాత్రమే కనిపిస్తుంది. గత 222 ఏళ్లుగా నీటిలో నానుతున్నా ఈ కట్టడానికి ఎలాంటి నష్టం జరగకపోవడం విశేషం. జైపూర్-ఆమెర్ మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్ దూరం నుండి చూస్తే నీటిపై తేలుతున్నట్లు కనిపిస్తుంది.
ఎవరు నిర్మించారు?
జల్ మహల్‌ను సవాయి జైసింగ్ 1799లో నిర్మించారు. దీనికంటే ముందు, జైపూర్ నీటి అవసరాల కోసం ‘గర్భవతి’ నదిపై ఆనకట్ట కట్టించి ‘మాన్ సాగర్’ సరస్సును నిర్మించారు. మహారాజు తన రాణులతో కలిసి ఏకాంతంగా సమయం గడపడానికి, అశ్వమేధ యాగం తర్వాత రాజ స్నానాలు ఆచరించడానికి ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. రాణులు దుస్తులు మార్చుకోవడానికి కూడా ఈ మహల్ వేదికగా ఉండేదని చరిత్రకారులు చెబుతారు.
మహల్ వెనుక ఉన్న రహస్యం:
ఎర్రటి ఇసుక రాయితో (Red Sandstone) నిర్మించిన ఈ మహల్ పునాదులు నీటి అడుగున ఎలా వేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. 4 అంతస్తులు నీటిలో ఉండటం వల్ల ఈ ప్యాలెస్‌లో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
- నర్సరీ: మహల్ పైకప్పు (టెర్రస్) మీద ఒక భారీ నర్సరీ ఉంది. ఇందులో లక్షకు పైగా మొక్కలు ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం 40 మంది మాలీలు (తోటమాలి) పనిచేస్తున్నారు. ఇది రాజస్థాన్‌లోనే అత్యంత ఎత్తులో ఉన్న నర్సరీగా పేరుగాంచింది.
