పాత ఫోన్‌ను మూలకు పడేయకండి! ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దాన్నే CCTVగా మార్చండి!

మీరు ఇంటికి సెక్యూరిటీ కెమెరా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక చింతించకండి. ఇక్కడొక అద్భుతమైన ప్లాన్ ఉంది చూడండి. CCTV కోసం భారీగా డబ్బు ఖర్చు చేసి కొత్తది కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.

ప్రస్తుతం అందరూ కొత్త కొత్త వెర్షన్ ఫోన్లు కొంటుండటంతో, ఇంట్లో పనికిరాకుండా పడి ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒకటి కచ్చితంగా ఉంటుంది. దాన్ని డ్రాయర్‌లో పడేసి ‘ఇ-వేస్ట్’ (e-waste) చేసే బదులు, మీరు దాన్ని ఇంటి సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చు.

పాత ఫోన్‌తో సెక్యూరిటీ కెమెరా
పాత ఫోన్, దాని కెమెరా మరియు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్‌తో మీ ఇంటిని పర్యవేక్షించడానికి, మీ పిల్లలను చూసుకోవడానికి లేదా పెంపుడు జంతువులపై నిఘా ఉంచడానికి ఒక సమర్థవంతమైన భద్రతా వ్యవస్థను సిద్ధం చేయవచ్చు. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు, దీని కోసం పెద్ద పెద్ద పరికరాలు కూడా అవసరం లేదు. చాలా సులభంగా మీ పాత ఫోన్‌ను భద్రతా కెమెరాగా మార్చుకోవచ్చు.

మీకు కావాల్సినవి:
థర్డ్ పార్టీ అప్లికేషన్: ముందుగా మీరు ఒక థర్డ్ పార్టీ సెక్యూరిటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

రెండు స్మార్ట్‌ఫోన్లు: మీకు ఇక్కడ రెండు మొబైల్స్ అవసరం. పాత ఫోన్ కెమెరాగా పనిచేస్తుంది, మరొకటి దాన్ని కంట్రోల్ చేయడానికి/చూడటానికి ఉపయోగపడుతుంది.

కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి
మొదట పాత ఫోన్‌లో కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. Android మరియు iOS కోసం ఇలాంటి అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు సాధారణంగా రిమోట్ రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్, లోకల్ స్టోరేజ్, టూ-వే ఆడియో (రెండు వైపులా మాట్లాడటం) మరియు మోషన్ డిటెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. డెవలపర్ల నుండి మంచి రేటింగ్ ఉన్న యాప్‌ను ఎంచుకుని, దాన్ని మీ పాత ఫోన్ మరియు కొత్త ఫోన్ రెండింటిలోనూ ఇన్‌స్టాల్ చేయండి.

రెండు ఫోన్‌లను కనెక్ట్ చేయండి
రెండింటిలో యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ అకౌంట్ ఉపయోగించి సైన్-ఇన్ అవ్వండి. రెండు ఫోన్లలోనూ ఒకే అకౌంట్ ఉండాలి, లేకపోతే అవి ఒకదానికొకటి కనెక్ట్ అవ్వవు. ఆపై యాప్‌లో సూచించిన విధంగా ‘పెయిరింగ్’ (Pairing) ప్రక్రియను పూర్తి చేస్తే మీ ఫోన్ కెమెరా సిద్ధమవుతుంది.

సరైన స్థలాన్ని ఎంచుకోండి
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇంటి తలుపులు లేదా కిటికీలు కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. ఈ ఫోన్ ఎప్పుడూ మీ వైఫై (Wi-Fi) నెట్‌వర్క్ పరిధిలో ఉండాలి. అలాగే, దీనికి నిరంతరం పవర్ సప్లై అవసరం, కాబట్టి ఫోన్ ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉండేలా చూసుకోండి. అవసరమైతే పవర్ బ్యాంక్ కూడా ఉపయోగించవచ్చు.

సెటప్‌ను పరీక్షించండి
అంతా పూర్తయిన తర్వాత, రెండు ఫోన్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించండి. పాత ఫోన్‌లో కెమెరా ఆన్ అయి ఉందా అని, మీ కొత్త ఫోన్‌లో లైవ్ ఫీడ్ (Live feed) కనిపిస్తుందో లేదో సరిచూసుకోండి.

ఇంతే! రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటికి CCTV సిద్ధం. మీ దగ్గర మరిన్ని పాత ఫోన్లు ఉంటే, వాటన్నింటినీ ఒకే వైఫై మరియు ఒకే అకౌంట్‌తో కనెక్ట్ చేసి ఇంటి నలుమూలలా నిఘా ఉంచవచ్చు.


Posted

in

by

Tags: