ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన ఐదు టీ20ల సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. స్టేడియం వెలుపల అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మైదానంలో దట్టమైన పొగమంచు కురవడంతో విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) చాలా తక్కువగా ఉంది. అంపైర్లు సుమారు ఆరుసార్లు మైదానాన్ని పరిశీలించారు. చివరకు రాత్రి 9:25 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానుల ముఖాల్లో ఒక్కసారిగా నిరాశ ఆవరించింది.
‘మూడు బస్తాల గోధుమలు అమ్మి టికెట్ కొన్నాను’
స్టేడియం నుండి బయటకు వస్తున్న సమయంలో ఒక అభిమాని ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ తన బాధను వెలిబుచ్చాడు. “నేను మ్యాచ్ టికెట్ కొనడం కోసం మూడు బస్తాల గోధుమలు అమ్ముకున్నాను. ఇప్పుడు నాకు నా టికెట్ డబ్బులు వెనక్కి కావాలి” అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరు అభిమానులు మాట్లాడుతూ.. “డబ్బులు తిరిగి రావడం ముఖ్యం కాదు, మేము ఎంతో ఆశతో మ్యాచ్ చూడాలని వచ్చాం, కానీ ఇలా జరగడం బాధాకరం” అని పేర్కొన్నారు.
తొలి అనుభవం.. చేదు జ్ఞాపకం
చాలా మంది అభిమానులు ఎంతో ఖరీదైన టికెట్లు కొని స్టేడియానికి చేరుకున్నారు. వీరిలో చాలా మంది మొదటిసారి స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూద్దామని వచ్చిన వారు కూడా ఉన్నారు. గంటల తరబడి ఎదురుచూసిన తర్వాత మ్యాచ్ రద్దు కావడంతో వారి తొలి అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్టేడియం వెలుపల BCCIకి వ్యతిరేకంగా కొందరు నిరసన కూడా తెలిపారు.
