రక్తంతో ప్రేమలేఖ.. ఇన్‌స్పెక్టర్‌కు విఐపి మహిళ ‘లవ్ టార్చర్’! బెంగళూరులో వింత ఘటన..

సాధారణంగా ప్రేమ పేరుతో అమ్మాయిలే వేధింపులకు గురవుతుంటారు. కానీ బెంగళూరులో ఒక పురుషుడు, అది కూడా ఒక పోలీస్ అధికారి, ఒక మహిళ చేసిన ‘లవ్ టార్చర్’కు చిక్కుకుపోయారు. 38 ఏళ్ల సంజన అనే మహిళ చేసిన ఈ వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఏం జరిగింది?
బెంగళూరు రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో సతీష్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అదే ప్రాంతంలో నివసించే 38 ఏళ్ల సంజన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండే మహిళా నాయకురాలు. వీరిద్దరికీ ఇటీవల పరిచయం ఏర్పడింది. అయితే, ఆ పరిచయం కాస్తా సంజన వైపు నుండి వికృతమైన ప్రేమగా మారింది.

11 ఫోన్ నంబర్లు.. అంతులేని మెసేజ్లు
సంజన నేరుగా తన ప్రేమను చెప్పకుండా, వివిధ ఫోన్ నంబర్ల నుండి సతీష్‌కు మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి” అంటూ ఒత్తిడి చేసేది. మొదట్లో ఎవరో ఆకతాయిలు చేస్తున్న పనిగా సతీష్ భావించారు. కానీ తరచుగా కాల్స్ రావడంతో అది సంజన అని గుర్తించి, ఆమె నంబర్లను బ్లాక్ చేయడం ప్రారంభించారు. ఆమె ఏకంగా 11 విభిన్న నంబర్ల నుండి కాల్స్ చేస్తూ ఆయనను వేధించింది.

రాజకీయ పలుకుబడితో బెదిరింపులు
సతీష్ తనను పట్టించుకోకపోవడంతో సంజన బెదిరింపులకు దిగింది. తనకు రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెబుతూ.. మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయనకు పంపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లు కూడా తనకు తెలుసని, తనను ప్రేమించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

పోలీస్ స్టేషన్లోనే రక్తంతో లేఖ!
ఒక దశలో సహనం కోల్పోయిన సంజన, నేరుగా సతీష్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కే వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న సతీష్‌కు తన రక్తంతో రాసిన ప్రేమలేఖను అందించింది. “నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని ఆ లేఖలో బెదిరించింది. దీంతో నిర్ఘాంతపోయిన ఇన్‌స్పెక్టర్ సతీష్, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సంజనను అరెస్ట్ చేశారు.

భార్యాపిల్లలు ఉన్నారన్నా వినకుండా..
ఈ ఘటనపై సతీష్ స్పందిస్తూ.. “ఆమెకు ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. కానీ నాకు భార్య, పిల్లలు ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నన్ను ఆమె ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టిందో అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: