ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్లో ఒక గర్భిణీని చెంపదెబ్బ కొట్టి, నెట్టివేసినట్లు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో సంబంధిత పోలీస్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జూన్ 18, 2024న జరిగింది. సస్పెన్షన్కు గురైన అధికారిని ప్రతాప్ చంద్రన్ అని గుర్తించారు.
దాదాపు ఏడాది కాలంగా ఆ దంపతులు న్యాయపోరాటం చేసిన తర్వాతే ఈ సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, బాధితురాలు శైమోల్ ఎన్ జె పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఆ అధికారి ఆమెను నెట్టివేసి, చెంపదెబ్బ కొట్టినట్లు విజువల్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి. తన భార్య గర్భిణీ అని బాధితురాలి భర్త పదేపదే మొరపెట్టుకున్నా, పోలీసులు వినలేదని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి జోక్యం
ఈ 33 సెకన్ల సీసీటీవీ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని ఆదేశించారు. దీంతో ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “కేరళలో పోలీసుల క్రూరత్వానికి ఇది మరో నిదర్శనం. చంటిబిడ్డతో ఉన్న గర్భిణీపై పోలీస్ స్టేషన్లోనే దాడి జరిగింది. ఏడాది కాలం పాటు న్యాయపోరాటం చేస్తే కానీ ఈ వీడియో బయటకు రాలేదు. ఇదేనా మీరు చెబుతున్న మహిళా రక్షణ?” అని ఆయన ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు.
