విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెక్ లైన్లలో నిలబడటం ఎంత విసుగు కలిగిస్తుందో ప్రయాణీకులకు తెలుసు. అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (టెర్మినల్-1) వద్ద ఒక చిన్న విషయం చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా ఒక పైలట్ ప్రయాణీకుడిపై దాడి చేసే వరకు వెళ్లింది.
అసలేం జరిగింది?
బాధిత ప్రయాణీకుడు అంకిత్ దీవాన్ తన భార్య, 7 ఏళ్ల కూతురు మరియు 4 నెలల పసిబిడ్డతో కలిసి సెలవుల కోసం స్పైస్‌జెట్ విమానంలో వెళ్తున్నారు. పసిబిడ్డ ఉండటంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వారిని ‘స్టాఫ్ స్పెషల్ లైన్’లో వెళ్లడానికి అనుమతించారు.
అంకిత్ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లైన్‌లో కొంతమంది సిబ్బంది ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అంకిత్ దీనిని అభ్యంతరం చెప్పడంతో, అక్కడ ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కెప్టెన్ వీరేంద్ర సేజ్వాల్ (ఆ రోజు ఆయన డ్యూటీలో లేరు, ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్తున్నారు) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మాట పెరగడంతో పైలట్ అంకిత్ ముఖంపై దాడి చేశారు.
“నా రక్తం చిందింది.. నా బిడ్డ భయపడిపోయింది”
అంకిత్ తన ముఖంపై రక్తం ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “నా రక్తం చిందింది. నా 7 ఏళ్ల కూతురు ఇదంతా చూసి ఇంకా షాక్‌లోనే ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ చొక్కాపై కూడా తన రక్తపు మరకలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత, తన 1.2 లక్షల రూపాయల హాలిడే బుకింగ్ వృధా కాకుండా ఉండాలంటే.. ఈ కేసును ఇక్కడితో వదిలేస్తున్నానని లేఖ రాసివ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని అంకిత్ ఆరోపించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందన
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీవ్రంగా స్పందించింది. “మా ఉద్యోగి ప్రయాణీకుడిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనకు మేము క్షమాపణలు కోరుతున్నాము. ఇటువంటి ప్రవర్తనను మేము ఖండించడమే కాకుండా, సదరు పైలట్‌ను తక్షణమే విధుల్లో నుండి తొలగించాము. విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాము” అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
