భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In (Indian Computer Emergency Response Team) వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. వాట్సాప్‌లోని ‘డివైజ్ లింకింగ్’ (Device Linking) ఫీచర్‌ను అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ‘ఘోస్ట్ పెయిరింగ్’ ద్వారా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారని తెలిపింది. దీంతో పాటు ఆపిల్ ఐఫోన్, మ్యాక్ మరియు ఐప్యాడ్‌లలోని పలు భద్రతా లోపాలపై కూడా హెచ్చరికలు జారీ చేసింది.
ఘోస్ట్ పెయిరింగ్ అంటే ఏమిటి? హ్యాకర్లు మీ పాస్‌వర్డ్, సిమ్ కార్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ (OTP) దొంగిలించకుండానే మీ వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయడాన్ని ‘ఘోస్ట్ పెయిరింగ్’ అంటారు. ఇది సాఫ్ట్‌వేర్ లోపం వల్ల కాకుండా, పూర్తిగా ‘సోషల్ ఇంజనీరింగ్’ (మాయ మాటలతో నమ్మించడం) ద్వారా జరుగుతుంది. వాట్సాప్ అధికారికంగా ఇచ్చే డివైజ్ లింకింగ్ సదుపాయాన్నే హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
- మీకు తెలిసిన వారి నుండి ‘నీ ఫోటో నాకు ఇప్పుడే దొరికింది’ వంటి సాధారణ మెసేజ్ ఒకటి వస్తుంది. అందులో ఒక లింక్ ఉంటుంది.
- ఆ లింక్ చూడటానికి ఫేస్‌బుక్ ప్రివ్యూలా ఉండటంతో వినియోగదారులు అనుమానం లేకుండా క్లిక్ చేస్తారు.
- లింక్ క్లిక్ చేయగానే అది ఒక నకిలీ వెబ్ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ ఫోటో చూడాలంటే మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయమని అడుగుతుంది.
- మీరు నంబర్ ఇవ్వగానే, హ్యాకర్ తన పరికరంలో మీ నంబర్ ఉపయోగించి వాట్సాప్ లింకింగ్ ప్రక్రియ మొదలుపెడతాడు. అప్పుడు మీ వాట్సాప్‌కు ఒక ‘న్యూమరిక్ కోడ్’ వస్తుంది.
- ఆ నకిలీ పేజీ ఆ కోడ్‌ను మీ వాట్సాప్‌లో ఎంటర్ చేయమని చెబుతుంది. మీరు అది భద్రతా పరీక్ష అని నమ్మి కోడ్ ఎంటర్ చేయగానే, హ్యాకర్ డివైజ్ మీ ఖాతాకు లింక్ అయిపోతుంది. మీరు ఆ పరికరాన్ని మాన్యువల్‌గా తొలగించే వరకు హ్యాకర్ మీ మెసేజ్‌లను చూడగలడు.
ఆపిల్ డివైజ్‌లలో ముప్పు: ఆపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్ మరియు ఐప్యాడ్ సాఫ్ట్‌వేర్‌లలో ఉన్న కొన్ని లోపాల వల్ల హ్యాకర్లు మీ అనుమతి లేకుండానే మీ డేటాను దొంగిలించవచ్చని CERT-In తెలిపింది. మీ వ్యక్తిగత సమాచారం బయటకు రావడం, డేటా మార్చడం లేదా మొత్తం డివైజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించింది.
