ఒస్మాన్ హాదీ మరణ వార్త తెలిసిన తర్వాత గత గురువారం బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ ప్రతినిధి అయిన హాదీ మరణంతో దేశవ్యాప్తంగా నిప్పు పెట్టే ఘటనలు జరిగాయి. అదే సమయంలో మైమన్ సింగ్ జిల్లాలో ఒక నరమేధం జరిగింది. అక్కడ ఒక యువకుడిని నడిరోడ్డుపై చితకబాది చంపేశారు.
అంతటితో ఆగకుండా, అతని మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు కట్టి తగలబెట్టిన అనాగరిక చర్య బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) సంచలన విషయాలను వెల్లడించింది.
నిందితులను అప్పగించిన కంపెనీ యాజమాన్యం: మైమన్ సింగ్‌లో జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు పని చేస్తున్న దుస్తుల కర్మాగారం (Garment Factory) యాజమాన్యమే అతడిని ఉన్మాద మూకలకు అప్పగించిందని RAB తెలిపింది.
గురువారం రాత్రి మైమన్ సింగ్‌లోని ‘పయనీర్ నిట్వేర్’ ఫ్యాక్టరీ ఫ్లోర్ మేనేజర్ ఆ యువకుడితో బలవంతంగా రాజీనామా చేయించాడు. RAB అధికారి నైముల్ హసన్ మాట్లాడుతూ.. “సాయంత్రం 4 గంటలకు ఈ గొడవ మొదలైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ యువకుడితో రాజీనామా చేయించి, ఆ తర్వాత బయట వేచి ఉన్న ఉన్మాద మూకలకు అతడిని అప్పగించాడు” అని తెలిపారు.
పోలీసులకు ఎందుకు అప్పగించలేదు? ఆ యువకుడిపై ఏదైనా ఫిర్యాదు ఉంటే అతడిని పోలీసులకు లేదా భద్రతా దళాలకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యువకుడి భద్రతను నిర్ధారించకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గుంపుకు అప్పగించినందుకు ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ లోపల జరిగిన ఏదో చిన్న వివాదం బయటకు తెలియడంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
అరెస్ట్ అయిన వారు: పయనీర్ నిట్వేర్ కంపెనీ ఫ్లోర్ మేనేజర్ ఆలంగీర్ హుస్సేన్ (38), క్వాలిటీ ఇన్ఛార్జ్ మిరాజ్ హుస్సేన్ అకాన్ (46) తో పాటు తారిక్ హుస్సేన్, లిమన్ సర్కార్, మానిక్ మియా, ఇర్షాద్ అలీ సహా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
