తమిళనాడు దిండిగల్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ కోయంబత్తూరులోని ఒండిపుదూరులో బట్టల వ్యాపారం చేస్తోంది. ఆమెకు 16 ఏళ్ల క్రితం వివాహం కాగా, భర్త 2022లో మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఆ మహిళకు ఆమె సోదరి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సంబంధం వెతకడం ప్రారంభించింది.
పరిచయం మరియు మోసం: ఈ క్రమంలో, గత జనవరిలో చెన్నైకి చెందిన ఒక 38 ఏళ్ల వ్యక్తి వెబ్సైట్లోని ఫోన్ నంబర్ ద్వారా ఆమెను సంప్రదించాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టారు. ఇదే అదునుగా భావించిన సదరు వ్యక్తి, తన వ్యాపార అవసరాల కోసమని చెప్పి ఆ మహిళ నుండి ₹10 లక్షల నగదు మరియు 2.5 తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. డబ్బు, నగలు చేతికి అందాక అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. దీనిపై అనుమానం వచ్చిన మహిళ అతని గురించి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అసలు నిజం: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఆ వ్యక్తికి ఇదివరకే వివాహం జరిగిందని, ఇలాగే మరో మహిళను కూడా మోసం చేసినట్లు అతనిపై గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉందని తెలిసింది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ, తన డబ్బు మరియు నగలు తిరిగి ఇవ్వాలని అడగగా.. అతను ఆమెను అసభ్య పదజాలంతో దూషించి, చంపేస్తానని బెదిరించాడు.
దీనిపై బాధితురాలు కోయంబత్తూరు సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన నగలు, డబ్బును రికవరీ చేయాలని కోరింది. ఇలాంటి వ్యక్తుల వల్ల మరో మహిళ మోసపోకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
