వాషింగ్టన్: బెర్ముడా అనే చిన్న ద్వీపం కింద, భూమి అంతర్భాగంలో ఒక భారీ రాతి నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమిపై మరెక్కడా లేని విధంగా ఈ రాతి నిర్మాణం ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
బెర్ముడా ముక్కోణం మర్మం: అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా ముక్కోణం గుండా ప్రయాణించే విమానాలు, ఓడలు అకస్మాత్తుగా మాయమైపోతుంటాయని దశాబ్దాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వెతకడానికి వెళ్లిన విమానాలు కూడా తిరిగి రాకపోవడంతో ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. అలాగే, చుట్టూ లోతైన సముద్రం ఉన్నప్పటికీ, ఈ చిన్న దీవి సముద్ర మట్టం పైనే స్థిరంగా ఎలా ఉంది? ఎందుకు మునిగిపోవడం లేదు? అనే దానికి ఇప్పటివరకు సరైన వివరణ లేదు.
భూమి లోపల భారీ రాయి: తాజా పరిశోధనల ప్రకారం, ఈ ద్వీపం కింద భూమి లోపల సుమారు 20 కిలోమీటర్ల మందం కలిగిన ఒక భారీ శిల ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సాధారణ రాయిలా కాకుండా చాలా దృఢంగా, వెడల్పుగా ఉంది. ఒక నగరం నుండి మరో నగరానికి ఉన్నంత దూరంలో ఈ రాయి వ్యాపించి ఉంది. ఈ భారీ శిల వల్లే బెర్ముడా దీవి సముద్రంలో మునిగిపోకుండా స్థిరంగా ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
దీనిని ఎలా గుర్తించారు?: శాస్త్రవేత్తలు ఈ రాయిని నేరుగా చూడలేదు. భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే ప్రకంపనల (Seismic waves) వేగాన్ని విశ్లేషించడం ద్వారా దీనిని గుర్తించారు. ఈ తరంగాలు మట్టిలో నెమ్మదిగా, రాతిలో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ వ్యత్యాసాన్ని బట్టి భూగర్భంలో ఇంత పెద్ద రాయి ఉందని నిర్ధారించారు.
వాస్తవం ఏంటి?: అయితే, ఈ ఆవిష్కరణకు బెర్ముడా ముక్కోణంలో విమానాలు, ఓడలు మాయమవ్వడానికి ఎటువంటి సంబంధం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇది కేవలం భూమి ఎలా ఏర్పడింది? ఖండాలు ఎలా మారాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే.
