ముంబై బస్సులో సినీ స్టైల్ దోపిడీ.. అర్ధరాత్రి వేళ కత్తులతో బెదిరించి రూ. 1.22 కోట్లు లూటీ!

కొల్హాపూర్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి ముగిసి, అందరూ ఆ విజయాల చర్చలో ఉండగా.. అర్ధరాత్రి జరిగిన ఒక భయంకరమైన దోపిడీ ఉదంతం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ముంబై వెళ్తున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సును ఏడెనిమిది మంది దుండగులు కత్తులతో బెదిరించి, సుమారు రూ. 1.25 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు.

దోపిడీ జరిగిన తీరు: కొల్హాపూర్ నుండి ముంబై (సైన్, బైకుల్లా) వెళ్తున్న ‘అశోక’ కంపెనీకి చెందిన ప్రైవేట్ బస్సు (MH 09 GJ 7272) రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరింది. తావడే హోటల్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణికుల్లా బస్సు ఎక్కారు. పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై ‘భుతాచా మాల్’ పరిసరాల్లోకి రాగానే, బస్సులో ఉన్న ఆ ముగ్గురు కత్తులు తీసి డ్రైవర్‌ను బెదిరించి బస్సును రోడ్డు పక్కన ఆపించారు.

వెంటనే వెనుక నుండి మరో ఐదుగురు వ్యక్తులు సినిమా స్టైల్‌లో బస్సును వెంబడిస్తూ వచ్చి లోపలికి ప్రవేశించారు. ప్రయాణికులను, డ్రైవర్‌ను చంపేస్తామని బెదిరించి బీభత్సం సృష్టించారు.

ఏమేమి దోచుకెళ్లారంటే?: దోపిడీ దొంగలు పక్కా ప్లాన్‌తో వచ్చి బస్సులో పార్శిల్ రూపంలో రవాణా అవుతున్న విలువైన వస్తువులను టార్గెట్ చేశారు.

  • 34 కిలోల వెండి (గోనె సంచుల్లో ఉన్నది).
  • 26 కిలోల వెండి (ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నది).
  • మిషనరీ స్పేర్ పార్ట్స్.
  • 10 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు మొబైల్ ఫోన్. మొత్తం కలిపి రూ. 1,22,15,000 విలువైన సొత్తుతో నిందితులు పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ “ఇక్కడ ఆగితే చంపేస్తాం” అని డ్రైవర్‌ను హెచ్చరించారు. భయపడిన డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లి, కణేగావ్ వద్ద ఆపి 112 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

Posted

in

by

Tags: