మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో సరఫరా శాఖ (Supply Department) అధికారులు జరిపిన దాడుల్లో ఒక విస్తుపోయే మోసం బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం లైసెన్స్ కూడా లేకుండా ఒక వ్యక్తి తన నివాసంలోనే ఏకంగా పెట్రోల్ పంప్‌ను నిర్వహిస్తున్నాడు.
ముంఢాపాండే పోలీస్ స్టేషన్ పరిధిలోని భయ్యానగలా గ్రామంలో తన్వీర్ అనే వ్యక్తి తన ఇంటి లోపల ఎటువంటి లైసెన్స్ లేదా ఎన్ఓసీ (NOC) లేకుండా డీజిల్ పంప్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ సాధారణ పెట్రోల్ బంకుల్లో ఉండే విధంగానే డిస్పెన్సింగ్ మెషీన్ (నోజిల్), స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. అంతేకాకుండా, ఇక్కడ డీజిల్ కొనుగోలు చేసిన వారికి కంప్యూటర్ ద్వారా రూపొందించిన రశీదులను కూడా ఇస్తుండటం గమనార్హం. జిల్లా సరఫరా అధికారికి అందిన రహస్య సమాచారం మేరకు అధికారులు దాడి చేయగా, అక్కడ ఏర్పాటు చేసిన హైటెక్ సెటప్ చూసి షాక్ అయ్యారు. అధికారులు వెంటనే ఆ యంత్రాన్ని సీజ్ చేసి, సుమారు 950 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదకరమైన రీతిలో హైటెక్ సెటప్ ప్రధాన నిందితుడు తన్వీర్ తన ఇంటిని పూర్తిగా ఒక వ్యాపార పెట్రోల్ పంప్‌లా మార్చేశాడు. రీజినల్ ఫుడ్ ఆఫీసర్ ఆనంద్ ప్రభు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇంట్లో 950 లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను భూగర్భంలో ఏర్పాటు చేశాడు. వినియోగదారులకు నమ్మకం కలిగించడానికి ఆధునిక డిస్పెన్సింగ్ యూనిట్‌ను అమర్చాడు. అధికారులు దాడులు చేయడానికి ముందు ఒక డమ్మీ కస్టమర్‌ను పంపి, ఆయిల్ అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగారు.
భద్రతపై ఆందోళన జనాభా ఎక్కువగా ఉండే నివాస ప్రాంతంలో ఇటువంటి మండే స్వభావం గల ఇంధనాన్ని నిల్వ చేయడం ‘టైమ్ బాంబు’లాంటిదని అధికారులు పేర్కొన్నారు. ఎటువంటి అగ్నిమాపక భద్రత లేకుండా ఇలా చేయడం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు తన్వీర్ మీద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసిన పోలీసులు, అతనికి ఇంత పెద్ద మొత్తంలో డీజిల్ ఎక్కడి నుండి వస్తోంది? ఈ దందాలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. డీజిల్‌లో కల్తీ జరుగుతుందనే అనుమానంతో నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
