న్యూఢిల్లీ: తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే పారాసిటమాల్ వేసుకోవడం మనకు అలవాటు. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయాన్నే పాన్-డి (PAN-D) లేదా పాన్-40 టాబ్లెట్లు వాడుతుంటారు. అయితే, ఈ మందులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయా లేక మరింత హాని చేస్తున్నాయా? తాజా నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్, పాన్-40 వంటి మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది.
నవంబర్ నెలకు సంబంధించి నిర్వహించిన నాణ్యత సమీక్షలో మొత్తం 205 మందులు నిర్దేశిత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
ముఖ్యమైన వివరాలు:
- సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ 64 మందులను ‘నాణ్యత లేనివి’ (Not of Standard Quality) అని గుర్తించింది.
- స్టేట్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీలు మరో 141 మందులను నాణ్యత లేనివిగా తేల్చాయి.
- ఘజియాబాద్ నుండి సేకరించిన కొన్ని మందుల నమూనాలను చండీగఢ్ ప్రాంతీయ ప్రయోగశాల ‘నకిలీ’ (Spurious) అని నిర్ధారించింది.
ప్రముఖ బ్రాండ్లు కూడా నకిలీవే: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రముఖ బ్రాండ్లు అయిన పాన్-40 (ప్యాంటోప్రజోల్) మరియు టెల్మా-40 (టెల్మిసార్టన్ – బీపీ మందు) నకిలీ వెర్షన్లు మార్కెట్లో ఉన్నట్లు గుర్తించారు.
CDSCO సమాచారం ప్రకారం: అసలు కంపెనీల ప్యాకేజింగ్‌ను పోలి ఉండేలా నకిలీ బ్యాచ్‌లను సృష్టించి విక్రయిస్తున్నారు. సదరు అసలు తయారీ కంపెనీలు (Original Manufacturers) మాట్లాడుతూ.. పట్టుబడిన ఆ బ్యాచ్ మందులను తాము తయారు చేయలేదని స్పష్టం చేశాయి. దీనిపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది.
కేవలం పారాసిటమాల్, పాన్-40 మాత్రమే కాకుండా.. పలు రకాల దగ్గు మందులు (Cough Syrups), మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో కూడా పారాసిటమాల్ సహా 53 మందులు ఇలాగే ఫెయిల్ అవ్వడం గమనార్హం.
