చిక్కమగళూరు: పదేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా సమయానికి మొహం చాటేసి మరొకరిని పెళ్లాడిన ఓ యువకుడికి అతని మాజీ ప్రియురాలు చుక్కలు చూపించింది. పెళ్లి పీటల వద్దకు వెళ్లి నిలదీయడమే కాకుండా, పట్టుబట్టి చట్టపరంగా పోరాడి మోసం చేసిన ప్రియుడిని జైలు పాలు చేసింది. ఈ ఘటన చిక్కమగళూరులోని దొడ్డేగౌడ కళ్యాణ మంటపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే: చిక్కమగళూరు నగరంలోని కళ్యాణ నగర్ నివాసి శరత్, బేలూరుకు చెందిన అశ్విని గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిన్నే పెళ్లి చేసుకుంటానని అశ్వినికి శరత్ గట్టి భరోసా ఇచ్చాడు. అంతేకాకుండా, ఆమెకు వచ్చిన ఐదారు మంచి సంబంధాలను కూడా చెడగొట్టాడు. తీరా అశ్వినికి తెలియకుండా గుట్టుచప్పుడూ కాకుండా మరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.
విషయం తెలుసుకున్న అశ్విని, పెళ్లి రోజే నేరుగా కళ్యాణ మంటపానికి వెళ్లి న్యాయం చేయాలని రచ్చ చేసింది. అయితే అప్పటికే శరత్ మరో యువతి మెడలో తాళి కట్టేశాడు. ఆ సమయంలో మహిళా కమిషన్ మరియు పోలీసుల ద్వారా చట్టపరమైన పోరాటం చేస్తానని శపథం చేసిన అశ్విని, అన్నట్లుగానే మోసగాడు శరత్ను జైలుకు పంపడంలో విజయం సాధించింది.
దాడిపై ఫిర్యాదు: తనను మోసం చేయడమే కాకుండా, పెళ్లి రోజున కళ్యాణ మంటపంలో తనపై దాడి చేశారని అశ్విని చిక్కమగళూరు డీసీఆర్ఈ (DCRE) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను కళ్యాణ మంటపం లోపలికి వెళ్తుండగా తలుపులు వేసి, కనీసం ఆడపిల్ల అని కూడా చూడకుండా తనపై ఇష్టానుసారంగా దాడి చేశారని ఆమె ఆరోపించింది.
అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శరత్, అతని తల్లిదండ్రులు, అతని భార్య మరియు ఆమె తల్లిదండ్రులపై కూడా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుతం పోలీసులు శరత్ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటనపై వరుసగా 9 రోజుల పాటు న్యాయపోరాటం చేసిన అశ్విని, చివరకు నిందితుడిని జైలుకు పంపగలిగింది. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరుతో యువతి జీవితంతో ఆడుకుని, మరొకరితో సుఖంగా సంసారం చేద్దామనుకున్న యువకుడు తను చేసిన తప్పుకు రాత్రికి రాత్రే జైలు పాలయ్యాడు.
