బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భీకర బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఢాకాలోని మోగ్బజార్ ప్రాంతంలో కొందరు దుండగులు బాంబు విసరడంతో ఈ ఘోరం జరిగింది. మరణించిన వారిలో సియామ్ అనే యువకుడు ఉన్నట్లు గుర్తించారు.
డిసెంబర్ 24 సాయంత్రం మోగ్బజార్లోని స్వాతంత్య్ర సమరయోధుల స్మారకం ముందున్న ఫ్లైఓవర్ కింద ఈ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్ రాజకీయ నేత, బీఎన్పీ (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడానికి ఒకరోజు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.
ఫ్లైఓవర్ పైనుంచి విసిరిన బాంబు: ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సాయంత్రం సమయంలో ఫ్లైఓవర్ పైనుంచి దుండగులు బాంబును కిందకు విసిరారు. ఆ బాంబు పేలడంతో కింద ఉన్న సియామ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయాడు. కొద్దిసేపటికే అతను ప్రాణాలు విడిచాడు. మృతుడు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, ఘటన జరిగిన సమయంలో అతను అక్కడే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
దుండగుల పరారీ – దర్యాప్తు ప్రారంభం: ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు విసిరిన వెంటనే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) డిప్యూటీ కమిషనర్ మసూద్ ఆలం మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో బాంబు ఫ్లైఓవర్ పైనుండి కిందకు విసిరినట్లు తేలిందని చెప్పారు. అయితే ఈ పేలుడు వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
