తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై ప్రశాంత్ కిషోర్ మరియు ప్రముఖ జర్నలిస్టులు చేసిన అంచనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమాలో శిఖరాగ్రాన ఉన్న విజయ్‌కు రాజకీయ రణక్షేత్రం అంత సులభం కాదని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఫార్ములా – విజయ్ పరిస్థితి: ప్రశాంత్ కిషోర్ గతంలో బీహార్ ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పారు- “నేను గెలిస్తే అధికారాన్ని దక్కించుకుంటాను, లేదంటే జీరో అవుతాను”. ఆయన అంచనా వేసినట్టే అక్కడ సున్నా ఫలితమే వచ్చింది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా సీనియర్ జర్నలిస్టులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2026 ఎన్నికల్లో విజయ్ “అయితే అధికారాన్ని చేపట్టాలి లేదా పూజ్యానికి పరిమితం కావాలి”. తమిళనాడులో ప్రస్తుతం ‘కింగ్ మేకర్’ (మధ్యస్థ శక్తి) అయ్యే అవకాశమే లేదు. ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తారు కాబట్టి, విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించి గెలవాలి; లేదంటే స్వల్ప ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని సీట్లు గెలిచి ఇతర పార్టీలతో కలిసి అధికారంలో భాగస్వామి అవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కూటమి ఉంటేనే గెలుపుకు అవకాశం: విజయ్ బలం యువత మరియు క్లీన్ ఇమేజ్. కానీ కేవలం అభిమాన సంఘాలతో డిఎంకె (DMK), ఏఐఏడిఎంకె (AIADMK) వంటి పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీలను 234 నియోజకవర్గాల్లో ఓడించడం కష్టం. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఒకవేళ కాంగ్రెస్ మరియు విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) వంటి పార్టీలు విజయ్ పక్షాన వస్తే, అది డిఎంకె కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది మరియు విజయ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. అటువంటి మెగా కూటమి ఏర్పడితేనే విజయ్ ‘తమిళనాడు మోడల్’ అనే తన కలను నిజం చేసుకోగలరు. లేదంటే ఓట్లు చీలిపోయి చివరికి డిఎంకెకే లాభం చేకూరుతుంది.
గత అనుభవాలు – సినిమా గ్లామర్ సరిపోదు: విజయ్ కేవలం ‘సినిమా గ్లామర్’ మీద మాత్రమే ఆధారపడకూడదని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రాలో చిరంజీవి (ప్రజారాజ్యం), తమిళనాడులో విజయకాంత్ (DMDK), కమల్ హాసన్ (MNM)లకు ఎదురైన పరిస్థితులను ఉదాహరణగా చూపుతున్నారు. లక్షలాది మంది అభిమానులు ఉన్నా, వారు ఓట్లుగా మారకపోవడమే స్టార్ నటుల వైఫల్యానికి కారణమైంది. విజయ్ తన చుట్టూ ఉన్నవారు ఇచ్చే అతిశయోక్తి అంచనాలను నమ్మకుండా, క్షేత్రస్థాయిలో రాజకీయ వాస్తవాలను గ్రహించడం అవసరం.
