స్కూల్ విరామ సమయంలో అనుకోకుండా కింద పడటంతో, చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి దూసుకుపోయి ఒక చిన్నారి మరణించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటన వివరాలు: తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కుసుమంచి మండలం, నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన 6 ఏళ్ల విహార్ అనే చిన్నారి, స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విహార్ టాయిలెట్‌కు వెళ్లి, తిరిగి తన క్లాస్‌రూమ్‌కు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుండగా.. ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు.
ఆ సమయంలో విహార్ చేతిలో ఉన్న పెన్సిల్, అతడు కింద పడిన వేగానికి గొంతు భాగంలో బలంగా గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగడం గమనించిన స్కూల్ సిబ్బంది, వెంటనే బాలుడిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
చిన్న వయసులోనే పెన్సిల్ గుచ్చుకుని బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో నాయకన్‌గూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.
