సాధారణంగా బ్యాంకు నుండి ఏటీఎంలలో డబ్బులు నింపేటప్పుడు పొరపాటున నకిలీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తుంటారు. అయితే, తమిళనాడు తిరుపూర్ జిల్లాలో మాత్రం ఒక వ్యక్తి ఏకంగా కలర్ జిరాక్స్ మెషీన్‌తో నకిలీ నోట్లు తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు.
చట్టం ఏం చెబుతోంది? భారతదేశంలో కరెన్సీ నోట్లను కలర్ జిరాక్స్ తీయడం లేదా అచ్చువేయడం చట్టరీత్యా నేరం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం డబ్బు రూపం, రంగు, పరిమాణం మార్చడం లేదా కాపీ చేయడం ఫోర్జరీ కిందకు వస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.
ఏటీఎం ద్వారా బయటపడ్డ బాగోతం: తిరుపూర్ మంగళం రోడ్డులోని ICICI బ్యాంక్ ఏటీఎం సెంటర్లో గత నెల 15న జమ అయిన నగదును అధికారులు తనిఖీ చేయగా, అందులో 12 ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవని తేలింది. బ్యాంకు మేనేజర్ మణిమారన్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ నగదును ‘గౌతమ్’ అనే వ్యక్తి జమ చేసినట్లు గుర్తించారు.
కిరాణా కొట్టు యజమాని అరెస్ట్: పోలీసుల విచారణలో మురుగంపాలయంలో కిరాణా దుకాణం నడుపుతున్న రాజేంద్రన్ (45) అసలు నిందితుడని తేలింది. రాజేంద్రన్ కిరాణా వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం, ఇతర రాష్ట్రాల కార్మికులకు నగదు బదిలీ వంటి పనులు చేస్తుండేవాడు. తన దుకాణంలోని కలర్ జిరాక్స్ మెషీన్ ఉపయోగించి ₹500 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చాడు.
మూడు నెలలుగా దందా: గత మూడు నెలలుగా తన వద్దకు వడ్డీకి డబ్బు తీసుకోవడానికి వచ్చే వారికి, అసలు నోట్ల మధ్యలో ఒకటి రెండు నకిలీ నోట్లను కలిపి ఇస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు రాజేంద్రన్‌ను అరెస్ట్ చేసి, దుకాణంలోని జిరాక్స్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
