పొడవాటి గోధుమ రంగు జుట్టు, నీలి రంగు కళ్లు, తెల్లటి చర్మం… చర్చిలలో మనం చూసి అలవాటు పడిన యేసుక్రీస్తు రూపం ఇది. కానీ, ఆధునిక ‘ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ’ (Forensic Anthropology) పరిశోధన ప్రకారం మనం ఇప్పటివరకు చూసిన ఆ రూపం కేవలం ఊహ మాత్రమేనని తేలింది.
చిత్రాలలో ఎందుకు ఇంత మార్పు? “అందం చూసేవారి కళ్లలో ఉంటుంది” అన్నట్లుగానే, ప్రతి దేశపు చిత్రకారులు తమ సంస్కృతికి అనుగుణంగా యేసు చిత్రాన్ని గీసుకున్నారు. యూరోపియన్లు ఆయనను తెల్లగా చిత్రించారు. కానీ చరిత్ర ప్రకారం చూస్తే ఇందులో చాలా తేడాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం, యేసును అరెస్టు చేయడానికి వచ్చిన సైనికులు శిష్యుల మధ్య ఉన్న ఆయనను గుర్తుపట్టలేకపోయారు. అంటే, ఆయన ఇతర సాధారణ యూదుల మాదిరిగానే సామాన్యమైన రూపాన్ని కలిగి ఉండేవారు.
సైన్స్ చెక్కిన ‘నిజమైన’ ముఖం: బ్రిటిష్ మెడికల్ ఆర్టిస్ట్ రిచర్డ్ నీవ్ (Richard Neave), ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలతో కలిసి యేసు ముఖాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. దీని కోసం వారు ఉపయోగించిన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:
- డిజిటల్ 3D రూపం: యేసు జీవించిన కాలానికి చెందిన ముగ్గురు యూదుల పుర్రెలను సేకరించి, వాటి ఆధారంగా డిజిటల్ 3D రూపాన్ని తయారు చేశారు.
- జుట్టు: అపోస్తలుడైన పౌలు రాసిన వాక్యాల ప్రకారం.. పురుషులు పొడవాటి జుట్టు పెంచడం అవమానంగా భావించేవారు. దీనిని బట్టి యేసుకు చిత్రాలలో చూపినట్లు పొడవాటి జుట్టు కాకుండా, పొట్టిగా ఉండే నల్లటి ఉంగరాల జుట్టు ఉండేదని తేలింది.
- చర్మం మరియు కళ్లు: మధ్య ప్రాచ్య (Middle East) దేశాల వాతావరణం ప్రకారం, ఆయనకు గోధుమ రంగు చర్మం (Tan skin) మరియు నల్లటి కళ్లు ఉండాలి.
- శారీరక ఆకృతి: యేసు వృత్తిరీత్యా వడ్రంగి (Carpenter). 30 ఏళ్ల వరకు ఎండలో కఠిన శ్రమ చేసిన వ్యక్తికి దృఢమైన కండరాలు, పరిణతి చెందిన చర్మం ఉంటుంది.
యేసు సగటు ఎత్తు ఎంత? పరిశోధనల ప్రకారం, ఆ కాలంలోని యూదు పురుషుల సగటు ఎత్తు సుమారు 5 అడుగుల 1 అంగుళం మాత్రమే. బరువు కూడా సుమారు 50 కిలోలు. చిత్రాలలో చూపినట్లు ఆయన చాలా ఎత్తుగా ఉండేవారు కాదనేది ఆశ్చర్యకరమైన విషయం.
ఈ ముఖమే వందకు వంద శాతం యేసు ముఖమని చెప్పలేం కానీ, శతాబ్దాలుగా చిత్రకారులు గీసిన ఊహా చిత్రాల కంటే సైన్స్ రూపొందించిన ఈ రూపమే సత్యానికి చాలా దగ్గరగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
