భారతదేశ స్వాతంత్ర్యం మరియు ధర్మ రక్షణ కోసం ఎందరో వీరులు బలిదానాలు చేశారు. వారిలో పెద్దలే కాదు, పసిపిల్లలు కూడా ఉన్నారు. నేడు ‘వీర బాల దివస్’ (Veer Baal Diwas) సందర్భంగా, సిక్కుల పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన ఇద్దరు సాహిబ్జాదాల వీరగాథను మరియు వారు ప్రాణత్యాగం చేసిన ఆ పవిత్ర భూమి విశేషాలను తెలుసుకుందాం.
మొఘలుల బందీలుగా చిన్నారులు: 1705వ సంవత్సరంలో మొఘలులతో యుద్ధం సమయంలో గురు గోవింద్ సింగ్ జీ కుటుంబం విడిపోయింది. ఆయన ఇద్దరు చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్ (6 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (9 ఏళ్లు) మరియు వారి నానమ్మ మాతా గుజ్రీ మొఘలులకు బందీలుగా చిక్కారు. వారిని ఫతేఘర్ సాహిబ్‌కు తీసుకెళ్లి, ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. కానీ ఆ చిన్నారులు మరణానికైనా సిద్ధపడ్డారు తప్ప తమ ధర్మాన్ని వీడలేదు.
గోడలో సజీవంగా సమాధి: ఎన్ని హింసలు పెట్టినా లొంగకపోవడంతో, మొఘల్ నవాబు వజీర్ ఖాన్ ఆ ఇద్దరు చిన్నారులను సజీవంగా ఇటుకల గోడలో పెట్టి సమాధి చేయాలని ఆదేశించాడు. ధర్మం కోసం ఆ చిన్నారులు ప్రాణత్యాగం చేశారు. వారి మరణవార్త విన్న మాతా గుజ్రీ కూడా కన్నుమూశారు. ఆ తర్వాత ఆ చిన్నారుల పార్థివ దేహాలకు అంతిమ సంస్కారం చేయడానికి కూడా మొఘల్ నవాబు స్థలం ఇవ్వడానికి నిరాకరించాడు.
బంగారు నాణేలు పరిచి కొన్న నేల: ఆ సమయంలో సిర్హింద్ నవాబు దర్బార్‌లో దివాన్ గా ఉన్న జైన్ తోడర్మల్ ముందుకు వచ్చారు. అంతిమ సంస్కారం కోసం ఆయన భూమిని కోరగా, నవాబు ఒక కఠినమైన షరతు విధించాడు. “భూమిపై నిలువుగా బంగారు నాణేలను (Ashrafis) పరిచి, ఆ నాణేలతో ఎంత భూమి కప్పబడుతుందో అంత భూమిని మాత్రమే ఇస్తాను” అని ప్రకటించాడు.
తమ గురు పుత్రుల గౌరవం కోసం తోడర్మల్ తన యావదాస్తిని ధారపోశారు. 4 గజాల భూమి కోసం ఏకంగా 78,000 బంగారు నాణేలను నేలపై నిలువుగా పరిచి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. 1705లో జరిగిన ఈ ఒప్పందం నేటి లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూమి కొనుగోలుగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ స్థలంలోనే మాతా గుజ్రీ మరియు సాహిబ్జాదాల అంతిమ సంస్కారం జరిగింది. నేడు అక్కడ ‘జ్యోతి స్వరూప్ గురుద్వారా’ వెలిసింది.
