ఛాతీ నొప్పితో 8 గంటల నిరీక్షణ; కెనడాలో భారతీయ ఆడిటర్ మృతి: కన్నీరు మున్సిపల్ చేస్తున్న భార్య వీడియో

ఎడ్మంటన్: కెనడాలో వైద్యం కోసం వెళ్ళిన ఒక భారతీయ ఆడిటర్, ఆసుపత్రిలో సుమారు 8 గంటల పాటు నిరీక్షించినా సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే: కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ప్రశాంత్ శ్రీకుమార్ (44) వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య మరియు 3, 10, 14 ఏళ్ల వయస్సు గల ముగ్గురు పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 22న పనిలో ఉన్న సమయంలో ప్రశాంత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో, మధ్యాహ్నం 12:20 గంటల ప్రాంతంలో స్థానిక ‘గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్’కు వెళ్లారు.

అక్కడ ఆయనకు రక్తపోటు (BP) 210కి చేరినప్పటికీ, కేవలం సాధారణ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చి వెయిటింగ్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఎలాంటి ప్రాణాపాయం లేదని చెబుతూ వైద్యులు ఆయనను నిర్లక్ష్యం చేశారు. సుమారు 8 గంటల పాటు నొప్పితో విలవిలలాడుతూ అక్కడే వేచి ఉన్న ఆయనను రాత్రి 8:50 గంటలకు చికిత్సా గదిలోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలి మరణించారు.

భార్య ఆవేదన: ప్రశాంత్ భార్య నిహారిక శ్రీకుమార్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత వీడియోను విడుదల చేస్తూ ఆసుపత్రి యజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నా భర్త చనిపోయారు. అత్యవసర చికిత్స కోసం నేను వేడుకున్నా వారు పట్టించుకోలేదు, పైగా సెక్యూరిటీ గార్డులు నాతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు” అని ఆమె వాపోయారు. ప్రశాంత్ చనిపోయే ముందు తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ.. “నాన్న, నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను” అని అన్న మాటలు అందరినీ కలచివేస్తున్నాయి.

ఈ ఘటనపై ఆసుపత్రి యజమాన్యం స్పందిస్తూ.. గోప్యతా చట్టాల కారణంగా వివరాలను వెల్లడించలేమని, చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ఈ విషయంపై విచారణ జరుపుతోందని తెలిపింది.


Posted

in

by

Tags: