సుప్రీంకోర్టు మానవీయ దృక్పథంతో ఒక యువకుడికి పదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసును ‘పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధంలో తలెత్తిన అపార్థం’గా కోర్టు అభివర్ణించింది.
ఏమిటీ కేసు? ఈ కథ 2015లో సోషల్ మీడియా ద్వారా మొదలైంది. ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి అంగీకారంతో శారీరక సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఈ బంధాన్ని వ్యతిరేకించలేదు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి తేదీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో తనను మోసం చేస్తున్నాడేమో అన్న భయం (Insecurity) తో ఆ యువతి 2021లో యువకుడిపై IPC సెక్షన్ 376 కింద రేప్ కేసు పెట్టింది.
10 ఏళ్ల శిక్ష – సుప్రీంకోర్టు జోక్యం: ట్రయల్ కోర్టు ఈ కేసులో యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జస్టిస్ బి.వి. నాగరత్న మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇది కేవలం చట్టపరమైన చిక్కు కాదని, దీని వెనుక మానవీయ కోణం ఉందని గ్రహించిన జడ్జిలు.. బాధితురాలు, నిందితుడు మరియు వారి తల్లిదండ్రులను స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
కోర్టు ఛాంబర్లో పెళ్లి నిర్ణయం: జడ్జిలు వారిద్దరితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, వారి మధ్య ఉన్నది ప్రేమేనని, పెళ్లి వాయిదా పడటం వల్ల కలిగిన ఆవేదనతోనే కేసు పెట్టానని ఆ యువతి అంగీకరించింది. ఇద్దరూ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో, పెళ్లి కోసం కోర్టు ఆ యువకుడికి ప్రత్యేక బెయిల్ మంజూరు చేసింది. జూలైలో వారిద్దరికీ వివాహం జరిగింది.
శిక్ష రద్దు మరియు ఉద్యోగం పునరుద్ధరణ: డిసెంబర్లో కోర్టుకు హాజరైన ఆ జంట ప్రస్తుతం సంతోషంగా ఉన్నామని చెప్పడంతో, సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని ఉపయోగించి నిందితుడిపై ఉన్న అన్ని అభియోగాలను, శిక్షను రద్దు చేసింది. అంతేకాదు, కేసు కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం కోల్పోయిన ఆ యువకుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలానికి సంబంధించిన జీతాన్ని కూడా చెల్లించాలని మధ్యప్రదేశ్ అధికారులను ఆదేశించింది.
