దక్షిణ-పశ్చిమ చైనాలోని యున్నాన్ ప్రాంతుకు చెందిన లింఖాంగ్ అనే గ్రామంలో “గ్రామ నియమాలు: అందరూ సమానమే” అనే శీర్షికతో ఒక నోటీసును ఊరంతా అంటించారు. ఆ నోటీసులో ఉన్న అంశాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఆ గ్రామంలోని వింత నియమాలు మరియు జరిమానాలు: సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ నోటీసులో పేర్కొన్న కొన్ని కీలక జరిమానాలు ఇవే:
- ప్రాంతం దాటి పెళ్లి: ఒకవేళ గ్రామస్తులు యున్నాన్ ప్రాంతు వెలుపల ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, వారు సుమారు 1,500 యువాన్లు (దాదాపు ₹17,000) జరిమానా చెల్లించాలి.
- పెళ్లికి ముందే గర్భం: పెళ్లికాకముందే గర్భం దాల్చిన మహిళలకు 3,000 యువాన్లు (దాదాపు ₹35,000) జరిమానా విధిస్తారు.
- లివ్-ఇన్ రిలేషన్షిప్: పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు ఏటా 500 యువాన్లు (దాదాపు ₹6,000) జరిమానా కట్టాలి.
- త్వరగా బిడ్డ పుడితే: పెళ్లయిన 10 నెలల లోపే బిడ్డ పుడితే, ఆ తల్లిదండ్రులు 3,000 యువాన్లు (₹35,000) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
- భార్యాభర్తల గొడవలు: భార్యాభర్తలు గొడవ పడి, ఆ పంచాయతీ తీర్చడానికి గ్రామ అధికారులు వస్తే, ప్రతి వ్యక్తి 500 యువాన్లు (₹6,000) ఇవ్వాలి.
- తాగి హంగామా చేస్తే: మద్యం తాగి గ్రామంలో గొడవ చేసేవారికి 3,000 నుండి 5,000 యువాన్ల వరకు (₹35,000 – ₹58,000) జరిమానా విధిస్తారు.
అధికారుల స్పందన: ఈ నోటీసు సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో స్థానిక ప్రభుత్వం స్పందించింది. మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ నియమాలు చాలా వింతగా ఉన్నాయని అంగీకరిస్తూనే, ప్రస్తుతం ఆ నోటీసును తొలగించినట్లు సమాచారం ఇచ్చారు.
