చేతివేళ్లకు పెద్ద పెద్ద గోళ్లు.. అవే ఇప్పుడు ప్రయాణికుల సర్వస్వాన్ని దోచుకునే ఆయుధాలుగా మారాయి. రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో ప్రయాణికులను దోచుకోవడానికి దుండగులు ఇప్పుడు సరికొత్త పంథాను (Modus Operandi) ఎంచుకున్నారు. ఆహారంలో మత్తుమందు కలపడం అనే పాత పద్ధతిని వదిలి, ఇప్పుడు తమ గోళ్లతోనే ప్రయాణికులను స్పృహ తప్పేలా చేస్తున్నారు. తాజాగా రైల్వే పోలీసుల విచారణలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గోళ్లలో విషం.. మాల్దాలో శిక్షణ! విచారణలో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా సభ్యులు తమ చేతి వేళ్ల గోళ్లను పెద్దగా పెంచుతారు. ఆ గోళ్ల సందుల్లో పొడి రూపంలో ఉండే మత్తుమందును దాచి ఉంచుతారు. స్టేషన్లో ప్రయాణికులతో మాటలు కలిపి, వారికి టీ లేదా కాఫీ తాగుదామని ప్రతిపాదిస్తారు. టీ కప్పును ప్రయాణికుడికి ఇచ్చే సమయంలో, అత్యంత చాకచక్యంగా తమ గోరును ఆ పానీయంలో ముంచుతారు. ఆ విషపూరితమైన టీ తాగిన కొద్దిసేపటికే ప్రయాణికుడు స్పృహ కోల్పోతాడు. అదే అదనుగా మొబైల్ ఫోన్లు, నగదు మరియు నగలతో దుండగులు పరారవుతారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నేరానికి సంబంధించి వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పట్టుబడిన నిందితులను విచారించగా, పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో దీనికి సంబంధించి ఒక ‘శిక్షణా కేంద్రం’ ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. గోళ్లలో మత్తుమందును ఎలా దాచుకోవాలి, ఎవరికీ తెలియకుండా దానిని పానీయాల్లో ఎలా కలపాలి అనే అంశాలపై అక్కడ శిక్షణ ఇస్తారు.
అప్రమత్తతే రక్షణ! ముర్షిదాబాద్, బర్ధమాన్, హౌరా మరియు సీల్దా వంటి ప్రధాన స్టేషన్లలో ఈ ముఠా విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు ప్రయాణికులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు:
- అపరిచితులు ఇచ్చే టీ లేదా కాఫీని అస్సలు తాగకండి.
- దుకాణదారుడు టీ ఇచ్చినప్పుడు, మీ కప్పును నేరుగా మీరే తీసుకోండి.
- మధ్యలో మీ టీ కప్పును వేరే ఎవరినీ పట్టుకోనివ్వకండి.
