‘నాకేం కాదు…’: మహిళపై అత్యాచారం; పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ మహిళా నేత భర్త, వీడియో వైరల్

భోపాల్: ఒక బీజేపీ కౌన్సిలర్ భర్త, ఓ మహిళపై చాకుతో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను వీడియో తీసి, ఆపై వాటిని చూపించి పదే పదే లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా రాంపూర్ బఘేలన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు, అతనితో మాట్లాడుతున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియోలో అతను “నువ్వు నన్ను ఏమీ చేయలేవు” అంటూ బాధితురాలిని బెదిరించడం కనిపిస్తుంది.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తిని అశోక్ సింగ్‌గా గుర్తించారు. ఇతను రాంపూర్ బఘేలన్ నగర పరిషత్ బీజేపీ కౌన్సిలర్ భర్త అని తెలిసింది. అశోక్ సింగ్ ఒక పోలీస్ అధికారిని దూషిస్తూ, బాధితురాలిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అయిన ఈ వీడియోలో, నిందితుడు “నాకేమవుతుంది? ఏమీ కాదు. నువ్వు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అని అంటుండగా, నేపథ్యంలో బాధితురాలు ఏడుస్తూ ఫిర్యాదు చేస్తానని చెబుతున్నట్లు వినబడుతోంది.

6 నెలల క్రితం జరిగిన ఘోరం నిందితుడు అశోక్ సింగ్ ఆరు నెలల క్రితమే బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆ నీచకృత్యానికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి పెట్టుకున్నాడని, ఆ వీడియో చూపించి బెదిరిస్తూ పదే పదే తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

ఈ నేరం ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ, తన ప్రాణాలకు మరియు కుటుంబానికి ముప్పు ఉంటుందని భయపడి తాను ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని బాధితురాలు పేర్కొంది. సోమవారం ఆమె సత్నా పోలీస్ సూపరింటెండెంట్ (SP) హంసరాజ్ సింగ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. ఎస్పీ వెంటనే స్పందించి, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సూపరింటెండెంట్ మనోజ్ త్రివేదిని ఆదేశించారు.


Posted

in

by

Tags: